
మీకోసంలో సమస్యల వెల్లువ
ఒంగోలు సబర్బన్: శ్రీ కృష్ణకళ్యాణ మండపం–యాదవ భవన్ నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తూ మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాన్ని పరిగణలోకి తీసుకొని ఆ భూమిని మళ్లీ ఇతర శాఖలకు కేటాయించకుండా చూడాలని ఆల్ ఇండియా యాదవ మహాసభ నాయకులు కలెక్టర్ తమీమ్ అన్సారియాకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వాళ్ల సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా యాదవ సామాజిక సేవా సంస్థ నిర్వాహకులు, జిల్లా యాదవ సంఘ నాయకులు ఆలిండియా యాదవ మహాసభ జనరల్ సెక్రటరీ కటారి శంకర్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిశారు. ఒంగోలు తహశీల్దార్ నివేదిక ఆధారంగా పెళ్లూరులో 70 సెంట్ల భూమిని సర్వే నెం.78/1లో యాదవ భవన్ కోసం మంజూరు చేశారని, దీనికి కౌన్సిల్ ఆమోదం తెలిపారని, భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారని చెప్పారు. అయితే తమకు కేటాయించిన స్థలంలో కొంత భాగాన్ని తాజాగా విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించి శంకుస్థాపన చేశారన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది యాదవుల మనోభావాలకు అనుగుణంగా శ్రీ కృష్ణ కళ్యాణ మండపం–యాదవ భవన్‌కి కేటాయించిన స్థలాన్ని యధాతథంగా ఉంచి, కౌన్సిల్ తీర్మానాన్ని కొనసాగించాలని కోరారు.
వ్యాయామ ఉపాధ్యాయుల
నకిలీ సర్టిఫికెట్లు పరిశీలించాలి:
2025 సంవత్సరంలో జరిగిన మెగా డీఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయుల (ఎస్‌ఏ పీఈ అండ్ పీఈటీ) నకిలీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి నాయకులు కలెక్టర్‌కు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల కోసం చాలామంది అభ్యర్థులు వ్యాయామ విద్య శిక్షణ పూర్తిచేయకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ నేరుగా పరీక్ష రాసి సర్టిఫికెట్లు పొందారన్నారు. అదేవిధంగా 4వ సెమిస్టర్ విద్యార్థులకు అవకాశం లేనప్పటికీ తప్పుడు సమాచారాన్ని దరఖాస్తులో నమోదు చేసి పరీక్ష రాశారన్నారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని వ్యాయామ విద్యా అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించిన వారి సర్టిఫికెట్లు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల ఆధార్ కార్డు నుంచి వారి పీఎఫ్ అకౌంట్ వివరాలు సేకరించి, అనర్హులైన వారి సర్టిఫికెట్లు రద్దుచేసి వ్యాయామ విద్య శిక్షణ తీసుకున్న నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు.
తల్లికి వందనం కోసం తిప్పుకుంటున్నారు
తల్లికి వందనం పథకం కోసం కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఒంగోలు రూరల్ మండలం ఉలిచి గ్రామానికి చెందిన బుర్రా రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన పెద్ద కుమారుడు బుర్రా శశి కుమార్ కోసం భార్య అనితా దేవికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లతో ఉలిచి సచివాలయంలో దరఖాస్తు చేశామన్నారు. తల్లి ఆధార్ మ్యాపింగ్ వేరే వారితో జరిగిందని తిరస్కరించారని చెప్పారు. టెక్నికల్ సమస్యను పరిష్కరించకుండా తిప్పుకుంటున్నారని, సమస్య పరిష్కరించాలని కోరారు.
మా ఆస్తులు లాక్కున్నాడు:
వరుసకు బావ అయిన భువన కాశిరెడ్డి తమ ఆస్తులు బలవంతంగా లాక్కున్నాడని మర్రిపూడి మండలం గంగపాలెం గ్రామానికి చెందిన భువన కోటేశ్వరమ్మ తన ఇద్దరు మానసిక వికలాంగులైన పిల్లలతో కలిసి వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తన భర్త భువన బ్రహ్మయ్య 2003వ సంవత్సరంలో చనిపోయాడని, అప్పటి నుంచి మానసిక వికలాంగులైన కుమారుడు రామాంజనేయులు, కుమార్తె రమాదేవిలను తన వద్ద ఉంచుకొని జీవనం సాగిస్తున్నానని వెల్లడించింది. అయితే తన సమీప బంధువు భువన కాశిరెడ్డి తనకున్న ఇల్లు, పొలం, దొడ్డి స్థలాలను బలవంతంగా లాక్కున్నాడని విలపించింది. చివరకు పిల్లలను సాకే స్థోమత లేక వారిని గుంటూరులోని అనాథ శరణాలయంలో ఉంచాల్సిన పరిస్థితి దాపురించిందని కన్నీరుమున్నీరైంది. తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకుంది.
యాదవ భవన్ భూమిని అలానే ఉంచాలి... వ్యాయామ ఉపాధ్యాయుల నకిలీ సర్టిఫికెట్లు పరిశీలించాలి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు విజ్ఞాపనలు

మీకోసంలో సమస్యల వెల్లువ