ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న 1980–81 పదో తరగతి పూర్వ విద్యార్థులు
ఇంకొల్లు (చినగంజాం): ఏరా ఎలాగున్నావ్.. ఎన్నాళ్లయిందో మిమ్మల్ని చూసి. ఇంట్లో అందరూ బాగున్నారా అంటూ ఒకప్పటి బాల్య స్నేహితులు నాలుగు దశాబ్దాల తరువాత కలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. షష్టి పూర్తి చేసుకునే తరుణం ఆసన్నమవుతున్న సమయంలో ఒక్కసారిగా కలుసుకోవడంతో అందరూ బాలలుగా మారి ఆనందోత్సాహాలతో తమ అమూల్యమైన సమయాన్ని కొద్ది గంటల పాటు గడిపారు. కరచాలనాలు, కౌగిలింతలతో తమ కలయికను పూర్తి కానివ్వక చిన్నప్పటి అనుభవాలను నెమరు వేసుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఎన్నో భావోద్వేగాల మధ్య తమకు దొరికిన ఆ కొద్ది మధుర క్షణాలను ఆనందంగా గడిపారు. ఏదో తెలియని ఆనందం, వింత అనుభూతుల మధ్య వారంతా కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నాలుగు దశాబ్దాల తరువాత తన ఒడిలో విద్యనభ్యసించిన చిన్నారులను చూసుకొని వారు చదివిన పాఠశాల కూడా ఎంతో మురిసిపోయింది.
ఆత్మీయ పలకరింపులతో మురిసిపోయారు..
ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలో ఆచార్య రంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం సమావేశం అయ్యారు. పాఠశాలలో 1980–81లో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 43 ఏళ్ల తరువాత మొదటిసారిగా కలుసుకున్నారు. సుమారు 40 మంది పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆప్యాయ పలకరింపులతో సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులను ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు. అనంతరం పాఠశాలలో తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. వారికి అందుబాటులో ఉన్న సైన్సు ఉపాధ్యాయులు ఎస్ నాగేశ్వరరావు, పీవీ సుబ్బారావు, మరో ఉపాధ్యాయుడు వెంకటరెడ్డి మాస్టారు చనిపోవడంతో ఆయన కుమారుడు, పాఠశాల పూర్వ విద్యార్థి రాఘవరెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేసి అనంతరం తమ జ్ఞాపకాలను, అనుభవాలను కుటుంబ సభ్యుల పరిచయాలతో తమకున్న కాలాన్ని గడిపారు.
43 ఏళ్ల తరువాత మొదటిసారిగా కలుసుకున్న పూర్వవిద్యార్థులు
తరగతి గదిలో ఆనందంగా కూర్చున్న పూర్వ విద్యార్థులు


