బిల్డప్‌ బాబు.. అదే డప్పు | - | Sakshi
Sakshi News home page

బిల్డప్‌ బాబు.. అదే డప్పు

Jan 6 2024 1:02 AM | Updated on Jan 6 2024 3:43 PM

కనిగిరి సభలో డప్పు కొడుతున్న చంద్రబాబు  - Sakshi

కనిగిరి సభలో డప్పు కొడుతున్న చంద్రబాబు

కనిరిగి అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా..మార్కాపురాన్ని జిల్లా చేస్తా..వెలిగొండను పూర్తి చేసి ఫ్లోరైడ్‌ బాధితులను ఆదుకుంటా అంటూ చంద్రబాబు పశ్చిమ ప్రకాశంపై నకిలీ హామీలు గుప్పించారు. పద్నాలుగేళ్లు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధి మళ్లీ అధికారం ఇస్తే చేస్తానంటూ మోసపూరిత మాటలతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఈ ప్రాంతంపై శీతకన్ను వేసిన ఆయన నేడు ఎన్నికల శంఖారావ సభలో హామీల వర్షం కురిపించడాన్ని చూసిన ఈ ప్రాంతవాసులు నిన్ను నమ్మంబాబూ అంటూ గుసగుసలాడారు. ఈయనగారి శుష్క వాగ్దానాలు వినలేక సభ మధ్యలోనే వచ్చిన జనం వెళ్లిపోవడం కనిపించింది.

కనిగిరి రూరల్‌: ఎన్నికల బహిరంగ సభ తర్వాత స్థానిక టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఇన్‌చార్జిలు, నేతలతో శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. సభలో నెలకొన్న పలు అంశాలపై చర్చించారు. ఆశించినంతగా జనం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అనంతరం పార్టీ చేపట్టే భవిష్యత్‌ కార్యాచరణ, అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రచార అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.

నియోజకవర్గాల వారీగా ముగ్గురు నలుగురు నేతలను లోపలికి పిలిచి మాట్లాడారు. ఇదిలా ఉండగా నేతల అంతర్గత సమావేశంలో కూడా చంద్రబాబు కనిగిరి అభ్యర్థిగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డే పోటీలో ఉంటారని ప్రస్తావించకపోవడం గమనార్హం. దీంతో పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. కనిగిరి నియోజవకర్గ పార్టీ సీనియర్‌ నేతల (పాత టీడీపీ నాయకుల)తో సీఎం చంద్రబాబు శనివారం ప్రత్యేక భేటీ నిర్వహించే అవకాశం ఉందని కొందరు నేతలు తెలిపారు.

కనిగిరి రూరల్‌: కనిగిరి వేదిక సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు విన్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఐదేళ్లు (2014–2019)వరకు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరి వైపు కన్నెత్తి చూడలేదు. 2019 ఎన్నికలకు ముందుకు నియోజకవర్గంలోని పామూరు మండలం దూబగంటలో ట్రిపుల్‌ ఐటీకి శంకుస్థాపన చేసి అడ్రస్‌ లేకుండా పోయారు. ఇప్పుడు మరళా ఎన్నికలకు మందు కనిగిరికి వచ్చి కనిగిరి కేంద్రంగా అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల గారడీ మాటలు వల్లించడంతో కనిగిరి ప్రాంత ప్రజలు ఇదేందీ.. బాబు.. అంటూ నివ్వెరపోతున్నారు. ‘రా ..కదిలి రా..’ పేరుతో టీడీపీ నేత చంద్రబాబు కనిగిరిలోని చాకిరాల సమీప ప్రాంగణంలో శుక్రవారం ఎన్నికల శంఖారావ తొలి సభకు జన స్పందన కరువైంది. ఈ సభా వేదికగా చంద్రబాబు నాయడు చేసిన ప్రకటనలపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి.

బాబు మాటలు పచ్చి అబద్ధాలు..
‘వెలిగొండ ప్రాజెక్టును తానే శంకుస్థాపన చేసి పనులు దాదాపు పూర్తి చేశానని.. దాన్ని మళ్లీ తానే ప్రారంభిస్తానని ప్రకటిస్తాను’ అంటూ ప్రసంగించడంపై జిల్లా వాసులు విస్తుపోతున్నారు. వాస్తవంగా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పది శాతం పనులు కూడా జరగలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దాదాపు 90 శాతం వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. అలాగే కనిగిరి ప్రజలకు సురక్షిత నీటి కోసం నాడు రక్షిత మంచినీటీ పథకం సమ్మర్‌ స్టోర్‌ ట్యాంక్‌ మంజూరు చేసి కనీసం పునాది రాయికూడ వేయలేదు. ఎన్నికల సమయంలో ట్రిపుల్‌ ఐటీ కళాశాలకు శంకుస్థాపనతో మమ అని పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కనిగిరి నిమ్జ్‌ మంజూరైంది.. పనులు జరగలేదు.. టీడీపీ హయాంలో నిమ్జ్‌ పూర్తి చేస్తాం లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని ప్రగల్భాలు పలికి ఐదేళ్ల కన్నెత్తి చూడలేదు.. ఇవన్నీ నిజాలు కాదా.. బాబూ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరలా ఇప్పడు ఎన్నికల వేళ కొత్త డ్రామానా అంటూ నిలదీస్తున్నారు.

ఉగ్రకు ఝులక్‌..
టీడీపీ ప్రస్తుత కనిగిరి నియోజవకర్గ ఇన్‌చార్జి ఉగ్ర నరసింహారెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఝలక్‌ ఇచ్చారు. తాను కనిగిరి టీడీపీ అభ్యర్థినంటూ చెప్పుకుంటూ తిరిగిన ఉగ్ర నరసింహారెడ్డికి చంద్రబాబు కనీసం కనిగిరిలో అతని మద్దతు ఇవ్వండి అనే పదం కూడా వాడలేదు. పైగా సామాజిక సమీకరణాల వారీగా సర్వేలు జరుగుతున్నాయి.. వాటి నివేదికల ఆధారంగా గెలుపు అవకాశాలు ఉన్నావారికే టిక్కెట్‌ ఉంటుందనే భావాన్ని వెలిబుచ్చారు. తనపై కూడా సర్వే జరుగుతుందని మీరంతా పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే సంకేతాన్ని ఇచ్చారు. నేరుగా చంద్రబాబు ఉగ్ర పేరును ప్రస్తావించకపోవంతో ఉగ్రసేనలో తీవ్ర నిరుత్సాహం నెలకొనగా.. పార్టీ అవిర్భానం నుంచి టీడీపీలో ఉన్న పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement