ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, మేదరమెట్ల, పర్చూరు, కందుకూరు, కనిగిరిలో–2, గిద్దలూరు, యర్రగొండపాలెం, కొండపి, దర్శి, పొదిలి వంటి 11 ప్రాంతాల్లోని ల్యాబ్‌ల్లో 48 మంది పనిచేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి తీసుకొచ్చే శాంపిల్స్ నీటిలో 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నీటిలో కరిగి ఉన్న మొత్తం లవణాల సంఖ్య (టీడీఎస్), నీటి కాఠిన్యత(టోటల్ హార్డ్‌నెస్), కాల్షియం, క్లోరైడ్, నీటిలో మిగిలిన ఉన్న క్లోరిన్, సల్ఫేట్, నైట్రేట్, ఐరన్ వంటి తదితర పరీక్షలు చేపడుతున్నారు.
జలజీవన్ మిషన్ ద్వారా
సురక్షితమైన నీరు
జలజీవన్ పథకం ద్వారా గ్రామాల్లో సురక్షితమైన తాగునీటిని ఏర్పాటు చేయడానికి జిల్లాలోని 38 మండలాల్లో 1445 పనులు (పైపులైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు) చేపట్టారు. ఇందులో 1028 పనులు పూర్తిచేయగా, 340 పనులు జరుగుతున్నాయి. 77 పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకుగానూ ఇప్పటి వరకు రూ.85 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో సగటున ప్రతి వ్యక్తికి 55 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. జల జీవన్ పథకం ముఖ్య ఉద్దేశం 2024 సంవత్సరానికి గ్రామాల్లోని ప్రతి వ్యక్తికి 55 లీటర్ల సురక్షితమైన తాగునీటిని అందించడం. వీటి ద్వారా 3,21,000 వేల మందికి ఒక్కొక్కరికి సగటున 55 లీటర్ల ప్రకారం ప్రతి రోజూ 1,76,55,000 లీటర్ల నీటిని అందిస్తున్నారు.