సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా? అని ప్రశ్నించారు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి అని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి కొల్లు రవీంద్ర పచ్చ కళ్ళజోడు తీసి చూస్తే వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కనపడుతుంది. చంద్రబాబులాగా అబద్దపు హామీలు జగన్ ఇవ్వలేదు. మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసిన ఏకైక నేత జగన్. చంద్రబాబు అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేమంటూ ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఎన్టీఆర్ నుండి రాష్ట్ర ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొడిచారు.
రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్ హయాంలోనే జరిగింది. జగన్ తెచ్చిన పది హార్బర్లు, మూడు పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా?. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా?. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందటం ఇష్టం లేదా?. విజయవాడ సిద్దార్థ కాలేజీకి కూడా లీజు పద్ధతిలో భూములు ఇచ్చారు. అక్కడ పేద విద్యార్థులకు సీటు కూడా దొరకదు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి. డిజైన్ల పేరుతో వందల కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


