సాక్షి, తిరుపతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు వెంకట గౌడ, సునీల్ కుమార్ నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆంధ్రజ్యోతి పేపర్లను తగలబెట్టారు. దీంతో, అక్కడున్న పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ సందర్బంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతో బ్రతుకు రాధాకృష్ణకు రాష్ట్రంలో మహిళలు అంతా ఎదురుతిరుగుతున్నారు. రాధాకృష్ణకు కూతురు లేదా?. మా నాయకులు, మహిళలు గురించి తప్పుడు కూతలు కాస్తున్నారు నీకు అర్హత ఉందా? డొక్కు సైకిల్‌పై వచ్చి వేల కోట్లకు ఎదిగినావు అంటే ఏవిధంగా ఎదిగావో అందరికీ తెలుసు. చంద్రబాబుకు బ్రోకర్‌గా పనులు చేశావు. కొత్త పలుకు అంటూ కొవ్వెక్కి పనులు చేస్తున్నాడు, కొవ్వు కరిగిస్తాం కొవ్వు తగ్గిస్తాం.
వైఎస్సార్‌సీపీ నాయకుల కుటుంబసభ్యుల్ని అంటే చూస్తూ ఊరుకుంటామా?. నీ అవినీతి పత్రికలు తగలబెడతాం. చంద్రబాబు, పవన్, మంత్రులను హెచ్చరిస్తున్నాం. మీరు తిట్టిస్తే.. మాకు తిట్టడం చేత కాక కాదు.. మాకు సంస్కారం అడ్డు వస్తోంది. మేము తిడితే రోడ్లపై తిరగలేక సిగ్గుతో తల దించుకుంటారు. మహిళల గురించి తప్పుగా రాస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ తగలబెట్టేస్తాం’ అని హెచ్చరించారు.
ఇక, అంతకుముందు.. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో మాట్లాడుతూ..‘రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2వేల కోట్లు ఖర్చు చేయలేని చంద్రబాబు 2లక్షల కోట్లు అమరావతి ఎలా ఖర్చు చేస్తారు?. ఈ రెండేళ్లలో 8వేల కోట్లు అమరావతికి ఖర్చు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు చంద్రబాబు. రాయలసీమ ద్రోహి ఈ ప్రాంతంలో పుట్టడం ఇక్కడి ప్రజలు దురదృష్టం.
రాయలసీమ పథకం నిలిపి వేయడం అంటేఈ ప్రాంత ప్రజలు గొంతు కోయడమే అవుతుంది. రాయలసీమ పథకం ఎంత ముఖ్యమన్నది ప్రజలకు తెలియజేయాలి. 87 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. పాదయాత్ర ద్వారా, మహా ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి’ అని కామెంట్స్ చేశారు.


