
సాక్షి, కృష్ణా: రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం.. నెలకాకపోతే రెండు నెలల జైల్లో పెట్టండి అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు.
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా?. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నడపలేదని 2014-19 మధ్యలోనే చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019లో వైఎస్ జగన్ వచ్చిన తర్వాత వైద్యానికి పెద్దపీట వేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆలోచన చేశారు. పేద పిల్లలు మెరుగైన వైద్య విద్యను అభ్యసించాలని ఆలోచన చేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఇందులో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు.
మాట తప్పిన లోకేష్ నాయుడు..
కాలేజీల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఒక 50 సీట్లకు పేమెంట్ కోట కింద పెట్టారు. వైఎస్ జగన్ ఆలోచనతో ప్రభుత్వం నుంచి డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అధికారంలోకి రాగానే 150 సీట్లు 15 వేలకే అందిస్తామని లోకేష్ నాయుడు చెప్పాడు. కానీ, అసలు కాలేజీలనే నడపలేనని ప్రైవేటు వాళ్లకు అప్పగించేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చాం. నిరసనకు పర్మిషన్ అడిగాం ఇవ్వనన్నారు. మెడికల్ కాలేజీ వద్దకు వెళ్తే లోపలేస్తామన్నారు. ప్రజల తరపున ప్రతిపక్షంగా పోరాడటం మా బాధ్యత. అందుకే ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టాం.
జనసేన, టీడీపీ సంగతేంటి?
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారు. 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ల కింద కేసు పెట్టారని చెబుతున్నారు. ప్రజల కోసం మేము పోరాడుతున్నాం.. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి. మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబుకు నచ్చింది చేసుకోనివ్వండి. హత్యలు చేసి దొరికిపోయిన వాళ్లే నామోషిగా ఫీలవ్వడం లేదు. ఇలాంటి కేసులకు మేమెందుకు బాధపడాలి. ప్రజల కోసం పోరాడాం.. నెలకాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండి. జిల్లా ఎస్పీ మాపై కేసులు పెట్టడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఎస్పీ చర్యలను స్వాగతిస్తున్నాం. కృష్ణాజిల్లాలో జనసేన, టీడీపీ నేతల అరాచకాలపై ఇలాగే కొరడా ఝుళిపించాలని కోరుకుంటున్నాం.

ఎస్పీకి సూచన..
గత ఎస్పీ కారణంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు రాజకీయ వ్యవస్థకు తలొగ్గారు. ఏకపక్షంగా వ్యవహరించడానికి అలవాటైపోయారు. గాడి తప్పిన పోలీసులను గాడిలో పెట్టండి. పాత అలవాట్లను వదిలించండి. స్టేషన్ ఆఫీసర్లు పేకాటను నడిపిస్తున్నారు. మర్డర్లు చేసే వారికి కొమ్ము కాస్తున్నారు. మరో స్టేషన్ ఆఫీసర్ పెద్ద ఎత్తున డీజిల్ మాఫియా నడిపిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర కనుసన్నల్లో ఆయన నడుచుకుంటారు. మంత్రి గారి అనుచరులు తప్ప మరొకరు డీజిల్ అమ్మితే ఆయన ఊరుకోరు. నెలకు పది నుంచి 12 లారీల డీజిల్ అమ్ముకుంటున్నారు. పోర్టు దగ్గర్లో భూమిలో రెండు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకు తెలిసే ఇంతలా బరితెగించారు. బందరు వాళ్లను కాకుండా బయట నుంచి ఆఫీసర్లను పంపించండి మీకే తెలుస్తుంది. మీ చుట్టూ గాడి చెప్పిన వ్యవస్థను సరిదిద్దండి. తప్పు చేసిన వాడు ఏ పార్టీ అయినా శిక్షించండి’ అని డిమాండ్ చేశారు.