 
													కోడూరు/అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటన ఒక ‘షో’లా సాగింది. కేవలం 15 నిమిషాల్లోపే రైతుల పరామర్శను ముగించారు. అది కూడా ముగ్గురు అన్నదమ్ములకు చెందిన ఒక్క పొలాన్ని మాత్రమే పరిశీలించారు. ఫొటోలు, వీడియో పోజులకే అధిక ప్రాధాన్యమిస్తూ.. ఇతర రైతులను దగ్గరికి రానివ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళా రైతులను పోలీసులు పక్కకు లాగేశారు. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్లు కావాలి గానీ.. సమస్యలు పట్టవా? 
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గురువారం కృష్ణా జిల్లా కోడూరు మండలం కృష్ణాపురంలో పర్యటించారు. ఈదురుగాలులకు నేలవాలిన ఐదెకరాల వరి పొలాన్ని పరిశీలించారు. ఆ పొలాన్ని సాగు చేస్తున్న ఇస్మాయిల్‌బేగ్‌పేటకు చెందిన అన్నదమ్ములు రమేశ్, వెంకటేశ్వరరావు, శివరామకృష్ణను పవన్ పరామర్శించారు. అప్పులు చేసి వరి సాగు చేస్తున్నామని.. తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయామని వారు వివరించారు.
అనంతరం తీర ప్రాంతంలో ముంపు బారిన పడిన వరి పొలాల డ్రోన్ విజువల్స్‌ను పవన్ వీక్షించారు. అదే సమయంలో ఇస్మాయిల్‌బేగ్‌పేటకు చెందిన కొందరు మహిళా రైతులు తమ సమస్యలను పవన్‌కు చెప్పుకునేందుకు రాగా.. పోలీసులు వారిని నెట్టివేశారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక రైతు కుటుంబంతో మాట్లాడితే అందరి సమస్యలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు.
మా ఓట్లు కావాలి గానీ.. మా సమస్యలు చెప్పుకుందామంటే తోసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హంసలదీవి, రామకృష్ణాపురం జనసేన నాయకులను కూడా దగ్గరికి రానివ్వకపోవడంతో.. వారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవుట్ ఫాల్ స్లూయిస్ గేట్లు దెబ్బతినడం వల్ల పొలాలు ముంపునకు గురవుతున్నాయని వారు చెప్పారు. స్లూయిస్ గేట్లు, రత్నకోడు డ్రెయిన్లను పరిశీలించకుండా ఒక్క పొలాన్ని చూసి వెళ్లిపోతే సరిపోతుందా? అంటూ మండిపడ్డారు.

ఫొటో పోజులకే ప్రాధాన్యం
పవన్‌కళ్యాణ్ పర్యటన యావత్తు ఫొటో పోజులకే ప్రాధాన్యమిచ్చారని స్థానికులు మండిపడ్డారు. మీడియా ప్రతినిధులు కాకుండా ప్రత్యేకంగా వచ్చి న కొందరు వీడియో, ఫొటో కెమెరాలతో చిత్రీకరిస్తుండగా.. మరికొందరు మూడు డ్రోన్ కెమెరాలతో హడావుడి చేశారు. తమను పట్టించుకోకుండా.. అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద రోడ్డు పక్కన పళ్ల వ్యాపారులతో ఫొటోలకు పోజులివ్వడంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
