‘చంద్రబాబు కుట్రలో భాగమే రాధాకృష్ణ చెత్త పలుకులు’ | Ysrcp Mlc Varudu Kalyani Fires On Abn Radhakrishna | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు కుట్రలో భాగమే రాధాకృష్ణ చెత్త పలుకులు’

Apr 8 2026 8:29 PM | Updated on Apr 8 2026 8:33 PM

Ysrcp Mlc Varudu Kalyani Fires On Abn Radhakrishna

సాక్షి, తాడేప‌ల్లి: వైఎస్సార్సీపీ నాయ‌కుల‌ను, మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా జుగుప్సాక‌రంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణ మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని, మ‌హిళా క‌మిష‌న్ సుమోటోగా కేసు న‌మోదు చేసి ఆయ‌న్ను త‌క్ష‌ణం అరెస్టు చేయాల‌ని వైఎస్సార్సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి డిమాండ్ చేశారు.

తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ దిగ‌జారుడు వ్యాఖ్య‌ల‌ను సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ లు స‌మ‌ర్థించ‌డం చూస్తుంటే ఇది యాధృచ్చికంగా చేసిన వ్యాఖ్య‌లు కావ‌ని, వైఎస్సార్సీపీ నాయ‌కుల వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసే కుట్ర‌లో భాగంగా జ‌రిగిన పన్నాగంగానే చూడాల‌ని చెప్పారు.

రాజ‌ధాని ముసుగులో చంద్ర‌బాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌ని, ఆచ‌ర‌ణ సాధ్యంకాని అమ‌రావ‌తికి ప్ర‌త్యామ్నాయంగా వైఎస్‌ జ‌గ‌న్ సూచించిన మావిగన్‌పై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ మొద‌లైంది. దాన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డం కోస‌మే రాధాకృష్ణతో కుట్ర‌లు చేయించార‌ని వ‌రుదు క‌ళ్యాణి మండిప‌డ్డారు. మ‌హిళ‌ల‌కు రాధాకృష్ణ క్ష‌మాప‌ణ‌లు చెప్పేవ‌ర‌కు వైఎస్సార్‌సీపీ త‌ర‌ఫున పోరాటం చేస్తూనే ఉంటామ‌ని హెచ్చరించారు. ఆమె ఇంకా ఏమ‌న్నారంటే..

అమ‌రావ‌తి వ్య‌తిరేకుల ముద్ర వేసే కుట్ర
వీకెండ్ కామెంట్స్‌, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ త‌న ఛానెల్‌లో వైఎస్సార్సీపీ నాయ‌కుల భార్య‌ల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ త‌ప్పుడు వ్యాఖ్య‌ల‌ను రాధాకృష్ణ త‌క్ష‌ణ‌మే వెన‌క్కి తీసుకుని మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌జేసింది. రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌ను ఖండించి ఆయ‌నపై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిపోయి సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌, హోంమంత్రి అనిత‌లు ఆయ‌న్ను స‌మ‌ర్థిస్తున్నారు.

ఆచ‌ర‌ణ సాధ్యంకాని అమ‌రావ‌తికి ప్ర‌త్యామ్నాయంగా త‌క్కువ ఖ‌ర్చుతో మ‌చిలీప‌ట్నం-విజ‌య‌వాడ‌-గుంటూరు కారిడార్‌ని మావిగన్ పేరుతో డెవ‌ల‌ప్ చేసుకోవ‌చ్చ‌ని వైఎస్‌ జ‌గ‌న్‌ సూచించిన క్ష‌ణం నుంచి ప్ర‌జ‌ల్లో ఆలోచన మొద‌లైంది. అమ‌రావ‌తి పేరుతో జ‌రుగుతున్న దోపిడీ గురించి ప్ర‌జ‌లు చ‌ర్చిస్తున్నారు. రాజ‌ధాని ముసుగులో చంద్ర‌బాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌ని కూట‌మి నాయ‌కులకు అర్థ‌మైపోయింది. దాన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని డైవ‌ర్ట్ చేయ‌డానికే ప్లాన్ ప్ర‌కారం ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌తో జుగుప్సాక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయించారు. రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌తో ఎవ‌రైనా వైఎస్సార్సీపీ నాయ‌కులు రియాక్ట్ అయితే వారిపై అమ‌రావ‌తి వ్య‌తిరేకుల ముద్ర వేసి మావిగ‌న్ అనే పేరెత్త‌కుండా చేయాల‌నే ప‌థ‌కం ప్ర‌కారం కుట్ర చేశారు.

అవే మాట‌ల‌ను మీకు అన్వ‌యించుకోండి
ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నిర‌స‌న‌ను దాడిగా చిత్రీక‌రించ‌డం దుర్మార్గం. ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న తెలియ‌జేసే హక్కు ప్ర‌జ‌ల‌కు లేదా? వైఎస్‌ జ‌గ‌న్ చెబితే వైఎస్సార్సీపీ నాయ‌కులు వారి భార్య‌ల‌ను చెల్లెళ్లుగా భావించి పెళ్లిళ్లు చేస్తార‌ని చెప్ప‌డం సంపాద‌కీయంలో భాగ‌మ‌ని చంద్రబాబు చెప్ప‌డం సిగ్గుచేటు. శాంతియుతంగా నిర‌స‌న తెలియజేస్తే దాడి అని ప్ర‌చారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం లేని వ్య‌క్తి డిబేట్‌లో మాట్లాడితే సాక్షి కార్యాల‌యాల‌ను ధ్వంసం చేశారు. మీ నాయ‌కుల ఇళ్ల‌లో ఉన్న త‌ల్లి చెల్లెళ్ల గురించి మాట్లాడితే ఇలాగే స‌మ‌ర్థిస్తారా? మీ హెరిటేజ్ షేర్ల‌లో, మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఎంత ఆస్తి రాసిచ్చారో ఒక్క‌సారైనా చెప్పారా?

ఏరోజైనా మీ తోబుట్టువుల‌ను పండ‌క్కి పిలిచి చీరసారె పెట్టి పంపించారా?  ఏ హ‌క్కుతో జ‌గ‌న‌న్న కుటుంబ స‌భ్యుల గురించి మాట్లాడ‌తారు? ప‌త్రికా స్వేచ్ఛ ముసుగులో వ్య‌క్తిత్వ హ‌న‌నం చేస్తున్న చంద్ర‌బాబుని ఏరకంగా స‌మ‌ర్థిస్తారు?   జ‌గ‌న‌న్న క‌ళ్ల‌లో ఆనందం కోసం వైయ‌స్సార్సీపీ నాయ‌కులు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేశార‌ని చెబుతున్న నారా లోకేష్‌, ఎవ‌రి ఆనందం కోసం ఏబీఎన్ రాధాకృష్ణ మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడాడు?  విశాఖ‌లో ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌కు స్థ‌లం కేటాయించినందుకా?  విజ‌య‌వాడ‌లో రాధాకృష్ణ ప‌వ‌ర్ ప్లాంట్‌కి అనుమ‌తులు ఇచ్చినందుకా?

ఇదేనా భువ‌నేశ్వ‌రి.. లోకేష్‌కి నేర్పించిన సంస్కారం? మంత్రి స్థానంలో ఉండి బాధ్య‌త మ‌రిచి ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి ఎంత దూర‌మో, సాక్షి నుంచి ఆంధ్ర‌జ్యోతికి అంతే దూరం అని మాట్లాడుతున్నాడు. మీ పార్టీలో మీ ఇంట్లో ఆడ‌వాళ్ల‌ను ఇలాగే అంటే ఊరుకుంటారా?  ఏబీఎన్ రాధాకృష్ణ మాట‌లు విశ్లేష‌ణ‌లు అని చెబుతున్న‌ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ద‌వుల కోసం మ‌న‌సు చంపుకుని మాట్లాడ‌టం అవ‌స‌ర‌మా అని ఆలోచించాలి. ఇదే ఏబీఎన్ పేప‌ర్‌, టీవీలో త‌న త‌ల్లిని దూషించినందుకు వాటిని బ‌హిష్క‌రించిన విష‌యం అప్పుడే మ‌రిచిపోయారేమో కానీ రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేదు.

హోంమంత్రి అనిత మ‌హిళ అయ్యుండి రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు. ఆమెకు ప‌ద‌వి ఇచ్చింది జ‌గ‌న్‌ని తిట్టడం కోస‌మా?  టీడీపీ నాయ‌కులు కూడా చంద్ర‌బాబు కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చుంటున్నారు. మోదీని తిట్టిన‌ప్పుడు సై అన్నారు. మోదీని పొగిడిన‌ప్పుడూ జై అన్నారు. రాధాకృష్ణ మాట్లాడిన ఇవే మాట‌లు మీకు అన్వ‌యించుకుంటారా చెప్పండి?  ఆయ‌న యూట‌ర్న్‌ల‌కు వంత‌పాడిన టీడీపీ నాయ‌కుల‌ను కూడా ఇలాగే అనొచ్చా? అనిత హోంమంత్రిగా ఉండ‌టం మ‌హిళ‌ల దౌర్భాగ్యం. రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించ‌డం ద్వారా మ‌హిళా లోకానికే క‌ళంకం తెచ్చారు.

ప‌త్రికా రంగానికి  ఆంధ్రజ్యోతి చీడ‌, రాధాకృష్ణ పీడ‌
ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌ను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏబీఎన్ రాధాకృష్ణ మీద మ‌హిళా క‌మిష‌న్ సుమోటోగా కేసు న‌మోదు చేయాలి. ఇంత‌దారుణంగా వ్య‌క్తిత్వ హ‌న‌నం చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మ‌హిళ‌ల‌కు రాధాకృష్ణ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. ఆయ‌న మీద కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసే వ‌ర‌కు వైఎస్సార్సీపీ నిర‌స‌న తెలుపుతూనే ఉంటుంది. ఇవి యాధృచ్చికంగా వ‌చ్చి న వ్యాఖ్య‌లు కావు. చంద్ర‌బాబు, లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల స‌మ‌ర్థింపుతో కావాల‌ని చేసిన కుట్రేన‌ని తేలిపోయింది.

వైఎస్సార్సీపీ నాయ‌కుల వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసే కుట్ర‌లో భాగంగానే ప‌థ‌కం ప్ర‌కారం ఇలాంటి దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ధాని పేరుతో చేస్తున్న వేల కోట్ల దోపిడీని వైఎస్‌ జ‌గ‌న్ ఆధారాల‌తో స‌హా వెలికితీయ‌డంతో చంద్ర‌బాబు త‌ట్టుకోలేకపోతున్నారు. వైఎస్‌ జ‌గ‌న్‌ ప్ర‌స్తావించిన మావిగ‌న్ మోడ‌ల్‌తో చంద్ర‌బాబు వేల కోట్ల అవినీతి ఆశ‌లు కుప్ప‌కూలిపోయాయి. వాటి నుంచి ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు డైవ‌ర్ట్ చేయ‌డం కోసం వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసే కుట్ర‌లు చేస్తున్నారు. ప‌త్రికా రంగానికి ఆంధ్ర‌జ్యోతి చీడ లాంటిది. జ‌ర్న‌లిస్టుల స‌మాజంలో రాధాకృష్ణ పీడ‌లాంటి వాడు. చంద్ర‌బాబుకి రాజ‌కీయ ల‌బ్ధి చేకూర్చ‌డానికి ఇలాంటి దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement