ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు | Sakshi
Sakshi News home page

ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు

Published Thu, Nov 24 2022 9:07 AM

YSRCP MLA Thopudurthi Prakash Reddy Fires on CPI Ramakrishna - Sakshi

సాక్షి, రాప్తాడురూరల్‌: ‘రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ కంపెనీ (పేజ్‌ ఇండస్ట్రీస్‌) యాజమాన్యం గుడ్‌విల్‌ ఇవ్వని కారణంగా పనులకు అంతరాయం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఆ పరిశ్రమ కాస్తా తమిళనాడులోని సేలానికి తరలిపోయిందంటూ 2018 డిసెంబరు 26న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. మరి ఆరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోజు గాడిద పళ్లు తోముతున్నాడా’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన అనంతపురం మండలం ఆలమూరు జగనన్న హౌసింగ్‌ లేఅవుట్‌ వద్ద  విలేకరులతో మాట్లాడారు.

ఆయన మాటల్లోనే... ‘కళ్లున్న కబోదులైన చంద్రబాబు, రామకృష్ణ, సోము వీర్రాజుకు వాస్తవాలు మాట్లాడితే రుచించదు. దొంగే..   దొంగ దొంగ అని అరిచినట్లు చంద్రబాటు ట్వీట్లు చేస్తున్నారు. కనీసం పునాదిరాళ్లకు కూడా నోచుకోని ఒక కాగితం కంపెనీకి ఆరోజు వందకోట్లు విలువైన భూములు కేటాయించి గొప్పగా ప్రచారం కల్పించారు. నిర్మాణం జరగకుండానే అది వెళ్లిపోతే రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? 1994లో నిన్ను (రామకృష్ణ) అనంతపురం ఎమ్మెల్యేగా గెలిపించారు.

ఆ తర్వాత నిన్ను నువ్వు అమ్మేసుకున్నావ్‌. పరిటాల కుటుంబానికి రాసిచ్చేశావు. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు. ఈ జిల్లాకు నీ కాంట్రిబ్యూషన్‌ ఏమీ లేకుండా నన్ను ఏవిధంగా విమర్శిస్తావ్‌. పెయిడ్‌ ఆర్టిస్ట్‌ లాగా పది మందిని వెంటేసుకుని వచ్చి డ్రామా నడిపి పోతావా? సోము వీర్రాజు కూడా నా గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాడు పత్రిక రాసిందల్లా నిజాలని భావించడం తగదు. 

అది లూటీ ఇండస్ట్రీస్‌ 
పేజ్‌ ఇండస్ట్రీస్‌ అనే సంస్థ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో భూముల కోసం ప్రయత్నించింది. పెట్టుబడులు పెడతామని అనేక రాష్ట్రాలకు వెళ్లిన సంస్థ ఎక్కడా పెట్టింది లేదు. పై మూడు రాష్ట్రాల్లో వాటి జీఎస్‌టీ నంబర్లు కూడా రద్దయ్యాయి. అంటే అక్కడ వ్యాపారాల్లేవు. కానీ రాప్తాడు అడ్రెస్‌తో ఉన్న ఆ సంస్థ జీఎస్‌టీ మాత్రం కొనసాగిస్తూనే ఉంది.  ఆరోజుల్లో వంద కోట్ల విలులైన భూములు కేవలం మూడు కోట్ల రూపాయలకు కంపెనీకి కేటాయించడంతో తప్పుమంత్రి ముడుపులు ఆశించారు.

ఈ క్రమంలోనే కాంపౌండ్‌ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేశారు. భూములు ఇచ్చింది మీరు..లంచం అడిగింది మీరు..ఎగ్గొట్టి పోయింది పేజ్‌ ఇండ స్ట్రీస్‌. మరి ఇందులోకి మేము ఎక్కడి నుంచి వచ్చాం? పేజ్‌ ఇండస్ట్రీస్‌ను రమ్మని పిలవండి. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విధంగా లక్షా 50 వేల చదరపు అడుగుల ఫ్యాక్టరీని నేను నిర్మించి ఇస్తా. అప్పటికీ వారు రాకపోతే ఏమనుకోవాలి? వారు రాకపోయినా వేరే సంస్థలైతే కచ్చితంగా తీసుకొస్తాం. ఇప్పటికే దాదాపు 20 సంస్థల ప్రతినిధులతో మాట్లాడాం.  

డిపాజిట్లు రావని తెలిసీ పరారీ మంత్రం 
రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలిసే పరిటాల కుటుంబం పరారీ మంత్రం పఠిస్తోంది. ధర్మవరం, పెనుకొండ సీట్లు అడుగుతోంది. కానీ చంద్రబాబు ఆ సీట్లను ఇప్పటికే అమ్మేసుకున్నారు. మీరు రాప్తాడులోనే పోరాడాలి. ఇక్కడ మీరు గెలవాలంటే నన్నైనా చంపాలి లేదంటే క్యారెక్టర్‌నైనా చంపాలి. అందులో భాగంగానే ఇప్పుడు నా క్యారెక్టర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. పరిటాల కుటుంబం రాజ్యమేలినప్పుడు ఈ ప్రాంత ప్రజలు కరువుతో వేలాదిమంది వలసలు వెళ్లారు.

ఈ రోజు  చెరువుల నిండా నీళ్లున్నాయి. పేరూరు డ్యాం పొంగి పొర్లుతోంది. ఆయకట్టు కళకళలాడుతోంది. 27 వేల ఇళ్లను మంజూరు చేయించా. పది వేలమంది పాడి మహిళా రైతుల కోసం తోపుదుర్తి సహకార డెయిరీ నిర్మిస్తున్నా. రైతులకు ఉచితంగా ఆరు వేల బోర్లు వేయిస్తున్నాం. ఇది చూసే  పరిటాల సునీత కళ్లల్లో కన్నీరు. రైతుల పేరుతో పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉంద’ని అన్నారు. సమావేశంలో రాప్తాడు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ బెడదూరి గోపాల్‌రెడ్డి, అనంతపురం రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్,  ఏడీసీసీ బ్యాంకు డైరెక్టర్‌ జనార్దన్‌రెడ్డి, బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కేవీ రమణ, నాయకులు ఆది, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.    

Advertisement
 
Advertisement
 
Advertisement