
విజయవాడ: పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి ప్రవర్తిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఒటర్ల ఇంటికి వెళుతన్న టీడీపీ నేతలు ఓటరు స్లిప్‌లు తీసుకుంటున్నారని, ఓటర్లు ఇవ్వకపోతే వారిని బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 11వ తేదీ) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్, వెల్లంపల్లి, జోగి రమేష్, మల్లాది విష్ణు, కల్పలతార్డెఇ, హఫీజ్ ఖాన్‌లు కలిశారు. దీనిలో భాగంగా టీడీపీ ప్రలోభాలపై ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం అందజేశార.
అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటిసి ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె,ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు. ఓటుకి పది వేలు రూపాయలు ఆశచూపిస్తున్నారు. ఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. గన్ మెన్ ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కే రక్షణ లేదు. అవినాష్ రెడ్డితో పాటు 150 మంది పై కేసులు పెట్టారు.
దాడులు చేస్తాం...కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పోలీసులు...షాడో పార్టీలున్నా కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారు. రికార్డుల ప్రకారమే పోలీసులున్నారు.. కానీ ఎవరినీ పట్టుకోరు. చంద్రబాబు 10 వేలు ఇచ్చి పంపిస్తే అందులో టిడిపి వాళ్లు 5 వేలు నొక్కేస్తున్నారు. రేపు ఉదయం లోపు మళ్లీ ఓటరు స్లిప్పులు పంచాలి. కాల్ సెంటర్ పెట్టాలి...స్లిప్పులు ఇవ్వమని బెదిరించినా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ రేపు ఒక్కరోజైనా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి’ అని పేర్కొన్నారు.

దీన్ని ఎన్నిక అంటారా చంద్రబాబు?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ‘దీన్ని ఎన్నిక అంటారా చంద్రబాబు. చంద్రబాబు నీకసలు సిగ్గుశరం ఉందా?, ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారు. గతంలో నంద్యాలలో కూడా ఇలాగే చంద్రబాబు వ్యవహరించారు. పులివెందులలో అసలు ప్రజాస్వామ్యమే లేదు. ఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. పులివెందులలో గెలిచానని సంకలు గుద్దుకోవాలని చూస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం ... లోపలా... బయట...సిసి కెమెరాలు పెట్టాలని కోరాం. పులివెందుల,ఒంటిమిట్టలో మొత్తం తన ప్రభుత్వాన్ని చంద్రబాబు మోహరించారు. ఎన్ని కుట్రలు చేసినా పులివెందులలో గెలిచేది వైఎస్సార్‌సీపీనే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది మా పార్టీ జెండానే’ అని తెలిపారు.