కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ధ్వజం | YSRCP Leader Perni Nani Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ధ్వజం

Apr 27 2026 4:22 PM | Updated on Apr 27 2026 4:30 PM

YSRCP Leader Perni Nani Slams Chandrababu Govt

మచిలీపట్నం:  కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నవీన్‌ మిట్టల్‌ కాలనీ, కరగ్రహారం జగనన్న లే అవుట్లను మాజీ మంత్రి పేర్ని నాని పరిశీలించారు.  దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ..  కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘ ఎన్నికల ముందు చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. పేదలకు మూడు సెంట్లు ఇస్తానన్న హామీని విస్మరించారు. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ పేదవాడి సొంతింటి కల నెరవేర్చారు. పదివేల కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల సొంతింటి ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. మచిలీపట్నంలో 16 వేల మందికి ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించాం. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగనన్న కాలనీలను నిర్వీర్యం చేస్తోంది. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు జరగని ఖాళీ స్థలాలను కొల్లు రవీంద్ర రద్దు చేస్తానని ప్రకటన చేయడం దారుణం. మచిలీపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు వైఎస్సార్‌సీపీ తరపున హామీ ఇస్తున్నాం.

ఏ ఒక్క లబ్ధిదారుడి స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. పేదల ఇళ్లను స్వాధీనం చేసుకుని కూటమి నేతలు లబ్ధి పొందాలనుకుంటున్నారు.  కూటమి నేతల యత్నాలను అడ్డుకునేలా పేదల తరపున న్యాయపోరాటం చేసేందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. కూటమి దురాగత పాలనకు ఇప్పటికే రెండేళ్లు ముగిశాయి. మరో రెండున్నరేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది వైఎస్సార్‌సీపీ పాలనే. 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రుద్రవరం టిడ్కో ఇళ్లను మధ్యలో వదిలేస్తే జగన్ హయాంలో వాటిని పూర్తిచేసి ప్రజలకు చేరువ చేశాం. ఆర్భాటంగా గృహ ప్రవేశాల పేరుతో కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. కానీ కనీసం త్రాగునీరు కరెంట్ సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. రుద్రవరం టిడ్కో ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారో జిల్లా కలెక్టర్ , మంత్రులు చెప్పగలరా?’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement