అండగా ఉంటాం.. ఆందోళనొద్దు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires On TDP Govt For Attacking YSRCP People | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం.. ఆందోళనొద్దు: వైఎస్‌ జగన్‌

Jul 8 2024 4:10 AM | Updated on Jul 8 2024 4:11 AM

వైఎస్సార్‌సీపీ నేతలతో మాట్లాడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ నేతలతో మాట్లాడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన జగన్‌

దుర్మార్గ సంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ బీజం వేస్తోంది

హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తోంది

సాక్షి ప్రతినిధి, కడప: ‘టీడీపీ వర్గీయులు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్‌ చేస్తూ వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఇలా ఐదేళ్లలో మనం ఎప్పుడూ దౌర్జన్యాలు చేయలేదు’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన బాధితులు వాపోతుంటే, అధైర్య పడొద్దని.. టీడీపీ దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొందామని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ‘మీ ప్రాంతానికి వస్తా.. మీకు అండగా నిలుస్తా.. ఆందోళన పడొద్దు, అందర్నీ కలుస్తా.. టీడీపీ దుర్మార్గాన్ని దీటుగా ఎదుర్కొందాం’ అని ఊరడించారు. 

ఆదివారం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ జిల్లాతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు, నాయకులతో ఆయన మమేకమయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, వీరాంజనేయులు, మగ్బూల్‌ బాషా, సాంబశివారెడ్డి తదితరులు వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాల అనంతరం ఆ జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాల గురించి వివరించారు. 

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘పోరాటాలు మనకు కొత్త కాదు. పోరాటం నుంచే పుట్టిన పార్టీ మనది. ఎంతో కాలం టీడీపీ దౌర్జన్యాలు నడవవు. మనోధైర్యం కోల్పోవద్దు. పార్టీ శ్రేణులకు అండగా ఉండండి. టీడీపీ బాధితులను నేను స్వయంగా కలుస్తా. అండగా నిలుస్తా. టీడీపీ దౌర్జన్యాలను సహించేది లేదు. మనందరం కలసికట్టుగా ఎదుర్కొందాం. మన కాలం వస్తోంది. అంత వరకూ కేడర్‌కు భరోసా ఇవ్వాలి’ అని ఆయన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.  

హామీలను విస్మరించి దాడులకు ప్రోత్సాహం 
‘ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి, చంద్రబాబు సర్కార్‌ వైఎస్సార్‌సీపీ కేడర్‌ను టార్గెట్‌ చేసి దాడులను ప్రోత్సహిస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదు. టీడీపీ సర్కార్‌ వ్యక్తిగత దాడులకు ఉసిగొల్పుతోంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ధైర్యంగా ఉండండి. పార్టీ తరఫున అండగా ఉంటాం’ అని మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ రఘురామిరెడ్డి, డాక్టర్‌ సుదీర్‌రెడ్డి తదితరులతో వైఎస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబునాయుడు ఇదివరకెన్నడూ లేని రీతిలో దుర్మార్గ సంప్రదాయానికి బీజం వేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే ఫలితం అనుభవించక తప్పదన్నారు.  

మానవత్వం చాటుకున్న వైఎస్‌ జగన్‌
ఈత కొడుతూ ప్రాణాపాయ స్థితిలోకెళ్లిన యువకుడు
తన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు
వైఎస్‌ జగన్‌  సకాలంలో స్పందించి ప్రాణా­పాయ స్థితిలో ఉన్న ఓ యువకుడి ప్రాణాలు కాపా­డారు.  ఆదివారం వైఎస్‌ జగన్‌ పులివెందుల నియోజక­వర్గం లింగాల మండలంలో పర్యటించారు. కోమన్నూతల గ్రామానికి చెందిన నారా­యణ స్వామి కుమారుడు నరేష్‌ (25) సాయంత్రం దిగుడు బావి­లో ఈత కొడుతుండగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. స్నే­హి­­తులు గమనించి, అతన్ని బైక్‌పై కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి ప­యనమయ్యారు. 

అదే సమయంలో చిన్నకుడాల వద్ద జగన్‌ కా­న్వా­య్‌ ఆగింది. వెంటనే ఆ యువకులు తమ స్నేహితుడి పరిస్థి­తిని కాన్వాయ్‌లో ఉన్న వారికి వివరించారు. 108కు కాల్‌ చేసినా రాలేదని చెప్పారు. విషయం తెలుసుకున్న జగన్‌ ఆలస్యం చేయ­కుండా తన వెంట ఉన్న అంబులెన్స్‌లో ఆ యువకుడిని పులివెందుల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేయడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.

మాజీ ఎంపీపీ కుటుంబానికి పరామర్శ  
వైఎస్సార్‌సీపీ లింగాల మండల కన్వీనర్, మాజీ ఎంపీపీ పెద్ద సుబ్బారెడ్డి సతీమణీ లక్ష్మీనరసమ్మ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ఆదివారం పెద్దకూడాల గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులందర్నీ పలుకరించి, ధైర్యం చెప్పారు. లింగాల మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన నాయకుల్ని పేరుపేరునా పలుకరించారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 

చక్రాయపేట మండలం గొంది గ్రామానికి చెందిన మబ్బు రామయ్య తన పట్టా భూమిలో దౌర్జన్యంగా టీడీపీ వర్గీయులు రోడ్డు వేస్తున్నారని వాపోయారు. అడ్డుకున్న తనపైనే తప్పుడు కేసు బనాయిస్తున్నారని వివరించారు. ఈ ఘటనపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. బాధితుడికి అన్యాయం చేయొద్దని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు ఓపికగా విన్నారు. అవసరమైన చర్యలకు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కే సురేష్‌బాబు, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గోటూరు చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement