గంగపుత్రులను తరిమేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తయ్యి రెండేళ్లయినా ఎందుకు అప్పగించలేదు?
రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లన్నీ మత్స్యకారుల హక్కు
చంద్రబాబు కాదు కదా.. ఆయన తాత కూడా మత్స్యకారులను పంపలేరు
నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్ జగన్
జువ్వలదిన్నె హార్బర్ భూములను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం దుర్మార్గం
మన ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మత్స్యకారులందరినీ పక్కాగా మ్యాపింగ్
రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లతో వారి జీవన ప్రమాణాల పెంపునకు శ్రీకారం
రూ.150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు
రూ.16 వేల కోట్లతో కొత్తగా 4 పోర్టులు
మరో రూ. 6 వేల కోట్లతో పోర్టుల విస్తరణ ప్రణాళిక సిద్ధం.. మొత్తంగా రూ.26 వేల కోట్లు
అన్ని రకాల అనుమతులతో దాదాపు 95 శాతం ప్రాజెక్ట్‌ల పనులు పూర్తి
మా ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి.. వచ్చేది మా ప్రభుత్వమే.. ఈ హార్బర్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
20 వేల మందిని బోట్లకు ఓనర్లను చేస్తామని మాట ఇస్తున్నా
ప్రాణాలకు తెగించి పట్టుకుంటే తమిళ బోట్లను వదిలేస్తారా?.. మార్చి 12న లోకేశ్ వచ్చాడు.. మార్చి 16న బోట్లు తరలించేశారు.. మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం లోకేశ్, ఎంపీ, ఎమ్మెల్యే ఏకమయ్యారు
కుట్ర ఆధారాలు కాల్‌డేటా సహా కళ్ల ముందు కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?
ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉండదు
పడకేసిన ఆరోగ్యశ్రీ.. మెడికల్ కళాశాలలు నిర్వీర్యం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు
అక్కచెల్లెమ్మల సున్నా వడ్డీ సైతం నిలిపివేత.. బాబుకు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి
చంద్రబాబుకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా.. కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. కళ్లు మూసి తెరిచే లోపు మూడేళ్లు పూర్తవుతాయి. మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాం. రాష్ట్రంలో కడుతున్న 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు. వాటిని చంద్రబాబు కాదు కదా వారి తాత కూడా లాక్కోలేరు.
రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, రూ.150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపు రూ.16 వేల కోట్లతో 4 పోర్టులు.. మొత్తంగా రూ.26 వేల కోట్లతో అన్ని రకాల అనుమతులతో పనులు ప్రారంభించాం. దాదాపు 95 శాతం ప్రాజెక్ట్‌ల పనులు పూర్తి చేశాం. మా ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశాం. ఇది జరిగి రెండేళ్లయినా మత్స్యకారులకు అందుబాటులోకి రాకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.
మన రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ ఏరియాలోకి పక్క రాష్ట్రాల మత్స్యకారులు రాకూడదు. కఠిన నిబంధనలు ఉల్లంఘించి తమిళనాడులోని కరైకల్ ప్రాంతానికి చెందిన మెకనైజ్డ్ బోట్లు వచ్చి మన మత్స్యసంపదను తరలించుకు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్లకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారే స్వయంగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆ బోట్లను సీజ్ చేశారు. దీంతో బీద సోదరులు కుట్ర పన్నడం.. నారా లోకేశ్ మార్చి 12న జువ్వలదిన్నెకు రావడం.. మార్చి 16న ఆ బోట్లను ఇక్కడి నుంచి తరలించుకుపోవడం చూస్తున్నాం. ఇందుకు బీద అనుచరుడు, బోట్ యజమాని మధ్య జరిగిన కాల్‌డేటానే సాక్ష్యం.
మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం నారా లోకేశ్, ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు పలువురు ఏకమవ్వడం దుర్మార్గం. ఆధారాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచి పెడతారా? మత్స్యకారులంటే ఇంత చులకనా? చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుందా?
– వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వారి కడుపుపై తంతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, రూ.150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపు రూ.16 వేల కోట్లతో 4 పోర్టులు.. మొత్తంగా రూ.20 వేల కోట్లతో ఆ పనులన్నింటికీ శ్రీకారం చుట్టాం. అవే కాకుండా అదనంగా మరో రూ.6 వేల కోట్లతో మొత్తంగా రూ.26 వేల కోట్లతో పోర్టులకు సంబంధించి విస్తరణ ప్రణాళిక కూడా సిద్ధమైంది. మా హయాంలోనే దాదాపు 95 శాతం ప్రాజెక్ట్‌ల పనులు పూర్తి చేశాం. మా ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశాం. 2024 మార్చి 12న ఎన్నికల కోడ్ రావడంతో ప్రత్యక్ష ప్రారంభానికి వీలుపడలేదు.
అదే ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రెండేళ్ల క్రితమే జాతికి అంకితమైన ఈ ఫిషింగ్ హార్బర్‌ను దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు అప్పగించకుండా కుట్రలతో వ్యవహరిస్తోంది’ అని నిప్పులు చెరిగారు. బుధవారం వైఎస్ జగన్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో మమేకమయ్యారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడారు. రెండేళ్లయినా ఇంత వరకు దీనిని గంగపుత్రులకు అప్పగించకుండా వారి పొట్ట కొట్టేందుకు చంద్రబాబు సర్కారు హార్బర్ భూములను సాగర్ డిఫెన్స్ సంస్థకు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. ‘జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమే కుట్ర చేస్తోంది. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. మేము రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని అక్కడి నుంచి తరిమేస్తాం. రాష్ట్రంలోని 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు, ఆస్తి. వాటిని ఎవరూ సొంతం చేసుకోలేరు. మత్స్యకారులందరినీ పక్కాగా మ్యాపింగ్ చేసి, ఆర్థిక తోడ్పాటు అందించి.. ఆ హార్బర్ల పరిధిలోనే మెకనైజ్డ్ బోట్లకు యజమానులను చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
జువ్వలదిన్నె హార్బర్ వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న మత్స్యకారులు, అశేష జనవాహినిలో ఒక భాగం
రూ.26 వేల కోట్లతో పనులు
⇒ రాష్ట్రంలో ఎంత ఘోరంగా అన్యాయాలు జరుగుతున్నాయనడానికి ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఉదాహరణ. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మొత్తంగా రూ.26 వేల కోట్లతో అన్ని రకాల అనుమతులతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ప్రారంభించాం.
⇒ ఇప్పటికే మూలపేట, మచిలీపట్నం పనులు 35 శాతం పూర్తి కాగా, రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఫిషింగ్ హార్బర్లలో జువ్వలదిన్నెను కూడా పూర్తి చేశాం. రాష్ట్రంలో అంతకు ముందు 4 ప్రదేశాల్లో 6 పోర్టులు ఉంటే, కొత్తగా మరో నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టాం. వాటి ద్వారా వాళ్ల జీవన ప్రమాణాలు మెరుగు పడాలని రాష్ట్రవ్యాప్తంగా ఒక మ్యాప్ గీసి పనులు చేపట్టాం. ఎక్కడెక్కడైతే మత్స్యకారులున్నారో వాళ్లందరికీ హక్కుగా ఫిషింగ్ హార్బర్లు రావాలి.
⇒ దేవుడి దయతో మన ప్రభుత్వ హయాంలోనే వీట న్నింటికీ వేగంగా అడుగులు ముందుకు పడ్డాయి. పోర్టులకు సంబంధించి కీలకమైన భూ సేకరణలు కూడా పూర్తి చేసి, అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చాం. ఈ పోర్టులన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, బ్యాంకు రుణాలను సైతం దీనికి టై అప్ చేశాం. ఫైనాన్సియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి, మారిటైమ్ బోర్డు క్రియేట్ చేశాం. అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయాం.
⇒ రామాయపట్నం పోర్టులో దాదాపు 95 శాతం ప్రాజెక్టు కూడా పూర్తి చేశాం. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో కీలకమైన భూసేకరణతో పాటు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్ కూడా పూర్తి చేసి, ఆ ప్రాజెక్టులో కూడా దాదాపు 35 శాతం పనులు వేగంగా పరుగెత్తించగలిగాం. అప్పటికే పనులు మొదలయ్యాయి. బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్లు పనులు చేసుకుంటూ పోతే చాలు ప్రాజెక్టుకు ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా పూర్తవుతుంది. ఆ స్టేజ్‌లోకి వాటిని తీసుకొచ్చాం.
⇒ మచిలీపట్నంలో కూడా భూ సేకరణ పూర్తి చేసి, అన్ని అనుమతులూ తీసుకొచ్చి బ్యాంకులతో టై అప్ చేసి, లోన్లన్నీ శాంక్షన్ చేయించాం. మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు చేసి, దాంట్లో కూడా దాదాపు 35 శాతం పనులు మన ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కాకినాడ వద్ద ఇంకో ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు మొదలు పెట్టింది. ప్రైవేట్ పోర్టు పక్కన పెడితే ప్రభుత్వ రంగంలో ఉన్న 3 పోర్టుల పనులు రెండేళ్లవుతున్నా ఎందుకు జరగడం లేదు? దీనిపై చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నా. ఇవి కాకుండా దాదాపు రూ.3,800 కోట్లతో మొదలు పెట్టిన 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు. ఇందులో జువ్వలదిన్నె ప్రాజెక్టు ఒకటి. 
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద మత్స్యకారులు
చంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలం
⇒ చంద్రబాబును రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా చీదరించుకుంటున్న పరిస్థితి. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్‌లు అని, బాండ్లు అని ఇంటింటికీ తిరిగి అందరినీ మోసం చేశాడు. ఎన్నికలైపోయిన తర్వాత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. ఆయన పెడతానన్న బిర్యానీ కూడా తీసేశాడు. చివరికి పలావు పోయింది. బిర్యానీ పోయింది.
⇒ ఫీజు రీయింబర్స్‌మెంట్ (విద్యా దీవెన), వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితులు. మరో వైపు చూస్తే గవర్నమెంట్ బడులు అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతున్న దుస్థితి. మనం గోరు ముద్ద పథకం అమలు చేస్తే, ఈ రోజు చిన్నారులకు మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనపడాల్సిన చోట, ఇంగ్లిష్ మీడియం బోధన జరగాల్సిన చోట.. ఈ రోజు నాసిరకం చదువులు అందుతున్నాయి.
పడకేసిన ఆరోగ్యశ్రీ.. మెడికల్ కళాశాలలు నిర్వీర్యం
⇒ ఆరోగ్య శ్రీ పథకం పడకేసింది. రూ.లక్షలు కడితే తప్ప పేదవాడికి వైద్యం అందని పరిస్థితి. ఈ రోజు కూడా ఇక్కడికి ఒకరు బోర్డు పట్టుకుని వచ్చారు. నా పరిస్థితి ఇలా ఉందన్నా.. మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉందన్నా.. అని బోర్డు పట్టుకుని నన్ను కలిసి గోడు చెప్పుకున్నాడు. అదే మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. 3,300 ప్రొసీజర్లతో ఏ పేద వాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా చిక్కని చిరునవ్వుతో వైద్యం అందించే పరిస్థితి ఉండింది. ఈ రోజు పేదవాడికి వైద్యం అందించడానికి నెట్‌వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేస్తున్న పరిస్థితి. వైద్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పాల్సిన పని లేదు.
⇒ ఉచిత పంటల బీమా గాలికెగిరి పోయింది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఆ రోజు అక్కచెల్లెమ్మలకు అన్ని పథకాలు అందిస్తూ.. సున్నా వడ్డీ పథకం సైతం అందించాం. ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఏ పథకమూ అందక.. చివరికి సున్నా వడ్డీ పథకం కూడా తీసేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రజలు చంద్రబాబును తిడుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు ప్రభుత్వాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే వస్తాయి.
మత్స్యకారుల అభివృద్ధి గురించి ఒక్క రోజైనా ఆలోచించారా?
⇒ తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఆ పోర్టులతో పాటు ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్, ఫిషింగ్ హార్బర్.. వీటన్నింటి ద్వారా మత్స్యకారులకు మేలు జరిగేలా బ్లూ ఎకానమీని బిల్డ్ చేసేలా అడుగులు ముందుకు వేశాం. అయ్యా చంద్రబాబూ.. నువ్వు ఏ రోజూ కూడా మత్స్యకారుల గురించి గానీ, రాష్ట్రం గురించి గానీ ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని ఏ రోజూ ఆలోచించ లేదు. ఏ రోజూ వాళ్లకు మంచి జరిగేలా కార్యక్రమం చేయలేదు.
⇒ నువ్వు ఎలాగూ చేయలేకపోతివి. కనీసం జగన్ చేసిన పని.. జువ్వలదిన్నెలో ఇక్కడే కనిపిస్తోంది. ఈ జువ్వలదిన్నె ప్రాజెక్టు తయారై రెండేళ్లు అవుతోంది. నేను 2024 మార్చి 12న ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా జాతికి అంకితం చేస్తే, ప్రధాని మోదీ అదే ఏడాది ఆగస్టులో జాతికి అంకితం చేశారు. అలాంటి దీనిని కూడా మత్స్యకారులకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదు? చంద్రబాబు గారూ సమాధానం చెప్పండి.
జువ్వలదిన్నె హార్బర్‌లో నిలిపి ఉన్న బోట్లను పరిశీలిస్తున్న వైఎస్ జగన్
రెండేళ్ల నుంచి ఎందుకంత తాత్సారం?
⇒ కాసేపటి క్రితం ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను రాష్ట్రం మొత్తానికి చూపించాం. ఈ ప్రాజెక్టు కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా రూ.300 కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రాజెక్టు అన్ని రకాలుగా పూర్తయినా కూడా ఈ ప్రభుత్వం మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురాక పోవడం దారుణం.
⇒ బాపట్ల జిల్లాలో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్‌కు సంబంధించి 62 శాతం పనులు మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్ పనులు కూడా దాదాపు 57 శాతం పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో మరో ఫిషింగ్ హార్బర్ పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే 56 శాతం పూర్తయ్యాయి.
⇒ మరో వైపు రెండో దశ కింద శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాళెం, మంచినీళ్లపేట, అనకాపల్లి జిల్లాలో పూడిమడక, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, బాపట్ల జిల్లా వాడరేవు, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. ఇవి కాకుండా దాదాపు రూ.150 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు.. విశాఖపట్నం జిల్లా భీమిలి, విజయనగరం జిల్లా చింతపల్లి, అనకాపల్లి జిల్లా రాజులపేట, దొండవాక, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పల్లంకలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం.
20 వేల మందిని బోట్లకు ఓనర్లను చేసే వాళ్లం
⇒ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, చిల్ రూమ్స్, ఐస్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ ఫామ్స్.. ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెట్ మెండింగ్ మెషీన్లు, గేర్ షెడ్‌ల వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చాం. ప్రతి ఫిషింగ్ హార్బర్‌లో ఈ వసతులన్నీ ఉంటాయి. ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏడాదికి దాదాపు 41 వేల టన్నుల మత్స్య సంపద వస్తుంది. మత్స్యకార అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరిగేలా వారికి ప్యాకింగ్, మార్కెటింగ్, వేల్యూ ఎడిషన్‌లో, ఫుడ్ స్టాల్స్‌లో పని దొరుకుతుంది. ఈ రకంగా పెద్ద ప్రణాళిక చేశాం.
⇒ ఇక్కడ ఏకంగా 1,250 మెకనైజ్డ్ బోట్లను మత్స్యకారులు హక్కుగా పొందాలని ఆరాటపడ్డాం. ఒక్కో బోటుకు 12–15 మంది వరకు గ్రూపు చేసి వారిని ఓనర్లుగా చేయాలని భావించాం. వారు 10 శాతం చెల్లిస్తే, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన 40 శాతం లోనుగా ఇప్పిస్తామని చెప్పాం. ఈ ఆదాయమంతా ప్రతి మత్స్యకారుడికి చెందాలని, వారి కుటుంబాలు బాగుండాలని కలలు కన్నాం. 2024లో మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కనుక వచ్చి ఉంటే మత్స్యకారులందరికీ బోట్లు అంది ఉండేవి. 1,250 మెకనైజ్డ్ బోట్లకు దాదాపు 20 వేల మంది మత్స్యకారులు ఓనర్లు అయ్యేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. అయితే మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో కడుతున్న 10 ఫిషింగ్ హార్బర్లను చంద్రబాబు కాదు కదా వారి తాత కూడా మత్స్యకారుల నుంచి లాక్కోలేరని హెచ్చరిస్తున్నా.
⇒ ఇక్కడ హార్బర్ కోసం సేకరించిన భూములను ప్రైవేట్ డిఫెన్స్ సంస్థకు కట్టబెట్టి మత్స్యకారులను తరిమేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నాడు. 79 ఎకరాల్లో సగం భూములు ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి కేటాయించి, దోపిడీ కార్యక్రమం చేపట్టారు. కృష్ణపట్నం పోర్టు వద్ద కావాల్సినన్ని భూములున్నాయి. అక్కడ ప్రైవేట్ సంస్థకు కేటాయించకుండా హార్బర్ భూములనే కట్టబెట్టడం వెనుక ఆంతర్యం గ్రహించాలి. ఇదంతా మత్స్యకారులను ఇక్కడి నుంచి తరిమేసే కార్యక్రమం. మత్స్యకారుల కోసం జగన్ భూములు సేకరించి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే, చంద్రబాబు వారిని తరిమేసి ప్రైవేట్ వారికిచ్చి దోచుకునే కార్యక్రమానికి తెర లేపాడు.


