తాలిబన్ల దురాక్రమణ: స్పందించిన బైడెన్‌

Withdraw Troops From Afghanistan Is Our Right Decision Says Biden - Sakshi

US President Joe Biden On Afghan Crisis: అఫ్గనిస్థాన్‌ నుంచి సైనిక బలాల ఉపసంహరణ.. అటుపై తాలిబన్ల అలవోక ఆక్రమణ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా-నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పజెప్పాడంటూ అఫ్గన్‌ ప్రభుత్వం-ప్రజలు సైతం బైడెన్‌పై దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముఖంగా స్పందించారు. 

భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసగించారు. ఆఫ్గనిస్థాన్‌లో పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కీలక ప్రకటన చేశారు. ఆఫ్ఘాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నాం. రెండు దశాబ్దాల తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంపై మేం చింతించడం లేదు. అమెరికా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి అమెరికా దళాలను వెనక్కి రప్పించుకోవడం. రెండోది.. మూడో దశాబ్దంలోనూ మరింత సైన్యాన్ని పంపి.. మోహరింపు కొనసాగించడం. రెండో దారిలో కొనసాగకూడదనే మా నిర్ణయం ముమ్మాటికీ సరైందనే భావిస్తున్నాం అని బైడెన్‌ వెల్లడించారు. 

చదవండి: నేనుంటే రక్తపాతం జరిగి ఉండేది!

జాతి నిర్మాణం మా బాధ్యత కాదు
ఆఫ్ఘానిస్థాన్‌లో జాతి నిర్మాణం అమెరికా బాధ్యత కాదని, అమెరికాపై ఉగ్రవాదులను నిరోధించడమే లక్ష్యం ఈ సందర్భంగా బైడెన్‌ స్పష్టం చేశారు. 20 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో ఆల్‌ఖైదాను అంతం చేశాం. బిన్‌ లాడెన్‌ను పట్టుకునేందుకు మేం వెనక్కి తగ్గలేదు. రెండు దశాబ్దాలుగా అఫ్గన్‌ సైన్యానికి శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వానికి మనోధైర్యం అందించాం. కానీ, వాళ్లు పోరాట శక్తిని ప్రదర్శించలేకపోయారు. అక్కడి ప్రభుత్వం ఊహించిన దానికంటే వేగంగా పతమమైంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. అవసరమైతే అప్ఘన్‌ ఉగ్రవాదంపై పోరాటం చేస్తాం. అఫ్గన్‌ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుంది అని బైడెన్‌ తేల్చి చెప్పారు.

మరోవైపు తాలిబన్ల చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన బైడెన్‌.. అఫ్గన్‌ నుంచి అమెరికా ప్రతినిధులను వెనక్కి రప్పించామని, అమెరికా సైన్యానికి సాయం చేసిన అఫ్గన్‌ ప్రజలను సైతం అవసరమైన చేయూత అందిస్తామని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top