చంద్రబాబు ఏ–1గా పది కేసులు  | Vijayasai Reddy comments over Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఏ–1గా పది కేసులు 

Mar 31 2024 4:55 AM | Updated on Mar 31 2024 9:35 AM

Vijayasai Reddy comments over Chandrababu Naidu - Sakshi

పొత్తుల వల్ల బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల్లో అభద్రతా భావం 

ఐటీ రంగం అభివృద్ధి సీఎం వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యం 

నెల్లూరు పార్లమెంటరీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి 

కందుకూరు రూరల్‌/నెల్లూరు (దర్గామిట్ట): ఎన్నికలు పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రధాన నిందితుడి(ఏ–1)గా సుమారు పది కేసులు నమోదు కాబోతున్నాయని రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం కందుకూరులోని శ్రీవెంగమాంబ ఫంక్షన్‌ హాల్‌లో కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఏ–1గా ఇప్పటికే మూడు, నాలుగు కేసులు నమోదయ్యాయని, మరో నాలుగైదు కేసులు నమోదు కాబోతున్నాయని చెప్పారు. చంద్రబాబు అవినీతికి పాల్పడిన సొమ్మును విదేశాలకు తరలించి అక్కడ ఆస్తులు కొనుగోలు చేశారన్నారు. అవినీతి సొమ్మును ఏపీలో పెట్టుబడి పెట్టినా కనీసం రాష్ట్రం బాగుపడేదన్నారు.  


 
బాబు పొత్తులతో వైఎస్సార్‌సీపీకే లాభం 
ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం అని.. ఈ పొత్తుల వల్ల బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు అభద్రతా భావంలోకి వెళ్లారని విజయసాయిరెడ్డి అన్నారు. దీనివల్ల వైఎస్సార్‌సీపీ లాభపడుతుందేగానీ.. నష్టం లేదన్నారు. అదేవిధంగా బీజేపీకి, జనసేనకు కూడా నష్టం లేదన్నారు. కేవలం నష్టపోయేది టీడీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, సోషల్‌ ఇంజినీరింగ్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ సీట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మార్పులు చేశారన్నారు.

వైఎస్సార్‌సీపీలో పదవులు అనుభవించిన రఘరామకృష్ణరాజు పార్టీలోనే ఉంటూ.. పార్టీని తిడుతూ రాజకీయం చేశారన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా తిరిగి ఆయనను చట్టసభలకు పంపించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితిని తనకు తానే కొనితెచ్చుకున్నాడని చెప్పారు. ఆయనను బీజేపీ, జనసేన, టీడీపీ సహా ఏ పార్టీ నమ్మడం లేదన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ఉన్నారు.  

నెల్లూరులో ఐటీ సెజ్‌ ఏర్పాటుకు కృషి 
కాగా.. నెల్లూరు రామ్మూర్తి నగర్‌లోని రామచంద్ర కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం సభ్యులతో ఆత్మీయ సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారని, రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విశాఖలో ఐటీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో నెల్లూరులో ఐటీ సెజ్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని, మౌలిక వసతులు కల్పించడం ద్వారా రాష్ట్రంలో ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 2019లో అధికారం చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐటీ రంగంపై దృష్టి సారించి ఆ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని, ఈ మేరకు ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ ఐటీ విభాగం సభ్యులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్‌అహ్మద్, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పోచంరెడ్డి సునీల్‌ మాట్లాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement