స్టాలిన్‌కు షాకిస్తూ.. విజయ్‌పై పొగడ్తల వర్షం! | Vaiko's praise for Vijay TVK leaves Stalin stunned | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌కు షాకిస్తూ.. విజయ్‌పై పొగడ్తల వర్షం!

May 2 2026 10:16 AM | Updated on May 2 2026 10:25 AM

Vaiko's praise for Vijay TVK leaves Stalin stunned

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డీఎంకే, అన్నాడీఎంకే, ఈ మధ్యలో టీవీకే.. ఎవరికి వారే అధికారం తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ముందస్తుగా క్యాంప్‌ రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

విజయ్‌ టీవీకే పార్టీపై  స్టాలిన్‌ మిత్రుడు, ఎండీఎంకే(Marumalarchi Dravida Munnetra Kazhagam) అధినేత వైకో ప్రశంసలు గుప్పించారు. విజయ్‌ ఈ ఎన్నికల్లో మ్యాజిక్‌ చేసే అవకాశం లేకపోలేదని అన్నారాయన. ‘‘టీవీకే తమిళ రాజకీయాల్లో ఓ శక్తిగా అవతరించింది. రాబోయే రోజుల్లో ఇక్కడి రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపగలదు. ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం లేకపోలేదు’’ అని వైకో అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భగా విజయ్‌కు ఉన్న ప్రజాదరణను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. యువత, మహిళలు, ముఖ్యంగా ఫస్ట్‌టైమ్‌ ఓటర్లలో విజయ్‌కి అశేష అభిమానులు ఉన్నారని చెప్పారు. అదే సమయంలో.. ద్రవిడ ఉద్యమం తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత శక్తిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించారు వైకో. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్యులర్‌ ప్రొ‍గ్రెసివ్‌ అలయన్స్‌తో చేతులు కలిపి పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు సీట్లు కేటాయించగా.. అందులో మూడు సీట్లను డీఎంకే గుర్తు(ఉదయించే సూర్యుడు), మరో అభ్యర్థిని స్వంత గుర్తుతో వైకో బరిలోకి దించారు. ఇదిలా ఉంటే..

ఎన్నికల అరంగేట్రంలోనే టీవీకే గణనీయమైన ప్రభావం చూపవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ సూచిస్తున్నాయి. మిగతా సర్వేలు డబుల్‌ డిజిట్‌ రావొచ్చని అంచనా వేస్తుంటే.. యాక్సిస్‌ ​మై ఇండియా (Axis My India) ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం 98–120 సీట్లు గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంటుందని తెలిపింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఇప్పుడు అధికార మిత్రకూటమి సీనియర్‌ నేత వైకో ప్రశంసలు గుప్పించడంతో విజయ్‌ అభిమానులు ఉబ్బితబ్బిబైపోతున్నారు.

ఏప్రిల్‌ 23న జరిగిన తమిళనాడు పోలింగ్‌లో 85.1% ఓటింగ్‌ నమోదైంది. అయితే.. యువత, కొత్త ఓటర్ల భాగస్వామ్యం పెరగడం TVKకి అనుకూలంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాడులో విజయ్‌కి కల్ట్‌ ఫాలోయింగ్‌ ఉంది. యాక్టింగ్‌ పీక్స్‌లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, యువతను ఆకర్షించే వాగ్దానాలు చేయడం ఆయనకు అదనపు బలం ఇస్తున్నాయి. విద్యార్థులకు స్టైపెండ్లు, స్టార్టప్‌ రుణాలు, మత్తు పదార్థాల రహిత రాష్ట్రం వంటి హామీలు ఆయన ప్రచారంలో ప్రధానంగా నిలిచాయి.

డీఎంకే ఆధ్వర్యంలోని కూటమి రెండోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా దాదాపు ఇదే ఖరారు చేశాయి. మరోవైపు అన్నాడీఎంకే వరుస ఓటముల తర్వాత తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్‌ తన తొలి ఎన్నికలోనే అన్నాదురై, ఎంజీఆర్‌ల విజయదుందుభి మోగించవచ్చనే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement