హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌ల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని, అది నిరూపిస్తానన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 3వ తేదీ) సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్‌ల కోసం మూడు కుర్చీలు వేశామని, కానీ వారు రాలేదన్నారు.
దీనిలో భాగంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ‘ పదేళ్ళ బీఆర్‌ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా.. నిరూపిస్తా. దమ్ముంటే కాదని నిరూపించండి. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు మీరు చేసిందా కాదా?, మిషన్ భగీరథ కార్పొరేషన్ అప్పు మీరు చేసింది కాదా?, మా ప్రభుత్వం చేసిన అప్పు గురించి నేను చాలెంజ్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత అప్పులకు వడ్డీ కింది రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా కట్టాం’ అని పేర్కొన్నారు.
ఇక హరీష్ రావు రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ.. అందులో ఏమీ లేదని విమర్శించారు. ‘ నేను లేఖలో ప్రస్తావించిన వాటికి హరీష్ నుంచి సమాధానం రాలేదు. అసలు మీరు ఎందుకు ప్రెస్‌క్లబ్‌కు రాలేదో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.


