Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై! నా నిర్ణయం తప్పయితే క్షమించండి..

Telangana: Komatireddy Rajagopal Reddy Resigns From Congress Likely To Join BJP - Sakshi

ఒకట్రెండు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా

కాంగ్రెస్‌ను విమర్శించను.. సోనియా అంటే గౌరవం

20 ఏళ్లుగా పార్టీని, సోనియాను తిట్టినవారి దగ్గర పనిచేయాలా?

టీఆర్‌ఎస్‌పై పోరాడే పార్టీలోకే వెళ్తా

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నానని బాధతో చెప్తున్నా. కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకుని ప్రజల్లో తిరగలేను. నేడో, రేపో రాజీనామా చేస్తా. నా పదవీ త్యాగంతో అయినా ఈ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలగాలి. ప్రజాస్వామ్యంలో అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలనే నిర్ణయానికి రావాలి. మునుగోడు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో రాజీనామా చేస్తున్నా’’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు.

తాను ఈ విషయంలో కొంత సమయం తీసుకుందామని అనుకున్నానని.. కానీ కొందరు గిట్టని వ్యక్తులు సోషల్‌ మీడియాలో, టీవీ ఇంటర్వ్యూలలో తన గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. ఆ దుష్ప్రచారాన్ని ఆపేందుకే ప్రకటన చేస్తున్నానని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేవలం ఒక్క కుటుంబం తెలంగాణను పాలిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలకు గౌరవం లేదని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. భవిష్యత్తులో శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లకు తప్పితే ఏ నియోజకవర్గానికీ నిధులు ఇవ్వడం లేదు. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ చుట్టూ అమెరికాలో ఉన్నట్టు రోడ్లు ఉన్నాయి. కానీ రోజూ వేల మంది తిరిగే చౌటుప్పల్‌–నారాయణపురం రోడ్డు మాత్రం గుంతలమయమైంది. ఏ అభివృద్ధీ చేయలేని ఈ ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకుని ఉండటం దేనికని రాజీనామా చేస్తున్నా..’’అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి అవుతుందంటే పదవీ త్యాగం చేస్తానని ఎప్పుడో చెప్పానని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళిత బంధు ఇచ్చినప్పుడే.. మునుగోడు దళితుల కోసం రూ.2 వేల కోట్లు ఇస్తే పదవీత్యాగం చేసి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం నిధులివ్వక మునుగోడును ఆశించినంత అభివృద్ధి చేయలేకపోయానని వాపోయారు. ఉప ఎన్నికలు వచ్చినచోట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆశ కలిగిందని.. అందుకే తన రాజీనామాతోనైనా మునుగోడు అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్‌ బలహీనం
కాంగ్రెస్‌ అంటే తనకు విశ్వాసం ఉందని, సోనియా గాంధీ అంటే గౌరవం ఉందని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. కానీ నాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో పార్టీ బలహీన పడిందని, పార్టీలో అంతర్గతంగా ఈ విషయం మాట్లాడినా లాభం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోనే ఉండాలని నాయకత్వం అడుగుతున్నా.. ఉండి చేసేదేమీ లేదని, టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ సరిగా పోరాటం చేయలేదు కాబట్టి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

‘‘20 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని తిట్టిన వారిని తీసుకొచ్చి వాళ్ల కింద మమ్మల్ని పనిచేయాలంటున్నారు. మాకు ఆత్మగౌరవం లేదా? ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పెద్దపీట వేయడమేకాదు.. వాళ్లే ప్రభుత్వం తీసుకువస్తారని మాట్లాడుతారా? పదవులు ఇవ్వకపోయినా కనీసం చర్చించి నిర్ణయాలు తీసుకోరా? కాంగ్రెస్‌ మీ కంట్రోల్‌లో ఉండాలా? ఏం తప్పు చేశామని మాపై చర్యలు తీసుకుంటారు? తెలంగాణ ఇచ్చికూడా తప్పులు చేసి మూర్ఖంగా పార్టీని నాశనం చేశారు. దీనివల్ల కాంగ్రెస్‌ కార్యకర్తలు నష్టపోయారు’’అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

అరాచక పాలనకు మోదీ, షాలతోనే చెక్‌
రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే మోదీ, అమిత్‌షాల నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమని.. తాను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రజల కోసం బతుకుతారు. డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లు కాదు. అవకాశవాద రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకోలేదు. నా రాజకీయ జీవితానికి, వ్యాపారాలకు సంబంధం లేదు.

నా కుమారుడే అన్ని వ్యాపారాలు చూసుకుంటున్నాడు. మునుగోడు ప్రజలు అర్థం చేసుకుంటారు. నా నిర్ణయం తప్పయితే క్షమించండి. సరైనదే అనుకుంటే నాతో రండి’’అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో ఎప్పుడు, ఎవరి సమక్షంలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. తన సోదరుడు వెంకటరెడ్డి ఏం చేస్తారనేది ఆయననే అడగాలని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top