కేసీఆర్‌ పెద్ద మోసకారి | Telangana: BJP President Bandi Sanjay Slams On CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పెద్ద మోసకారి

Apr 25 2022 2:24 AM | Updated on Apr 25 2022 2:24 AM

Telangana: BJP President Bandi Sanjay Slams On CM KCR - Sakshi

ఆదివారం నర్వలో బండి సంజయ్‌ పాదయాత్ర  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘కేసీఆర్‌ అంటే కోతల చంద్రశేఖర్‌రావు. పెద్ద మోసకారి. అవినీతి పరుడు. ఆయన మాటలు నమ్మి ప్రజలు బాగా నష్టపోయారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనుకుంటే మరింత దిగజారిపోయాయి’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర 11వ రోజు నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని యాంకి నుంచి ప్రారంభమైంది.

యాత్ర మధ్యలో జాతీయ పంచాయతీరాజ్‌ దివస్‌ను నిర్వహించారు. అంతకు ముందు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని మాదాసి కుర్వలు, ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయలు బండి సంజయ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో బండి సంజయ్‌ మాట్లాడారు. ‘బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం. అయితే కేంద్రం వద్దన్నా రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కదా.. అది సాధ్యమైనప్పుడు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో ఎందుకు చేర్చరు? ఎందుకంటే కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు’ అని సంజయ్‌ విమర్శించారు.  

మరి నిన్నేం చేయాలి?
‘కేసీఆర్‌.. నువ్వు సీఎం అయ్యాక ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చావో.. కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో వివరాలు వెల్లడించే దమ్ముందా? ఈ అంశంపై చర్చకు సిద్ధమా? అంటూ బండి సవాల్‌ విసిరారు. ‘మొక్క ఎండిపోతే సర్పంచ్‌ను సస్పెండ్‌ చేయాలన్నావ్‌ కదా.. మరి నువ్వు చేస్తున్న తప్పులు, మోసాలకు నిన్నేం చేయాలి’అని ప్రశ్నించారు. ‘ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం. ఆదర్శ గ్రామాల సర్పంచ్‌లను ఘనంగా సత్కరించి.. పంచాయతీల అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషిని వివరించి ఇతర గ్రామాల్లో స్ఫూర్తి నింపాల్సిన రోజు. కానీ కేసీఆర్‌కు సర్పంచ్‌లంటే లెక్కేలేదు. ఆయన దృష్టిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలు’అని మండిపడ్డారు.  

బీజేపీ అధికారంలోకి వస్తే గ్రామ ప్రభుత్వం 
‘మేము అధికారంలోకి వస్తే గ్రామ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. గ్రామానికి సర్పంచ్‌ సర్వాధికారిగా ఉంటారు. ప్రజలే గ్రామసభ నిర్వహించుకుని అభివృద్ధి పనులపై నిర్ణయం తీసుకునే అధికారం కల్పిస్తాం’అని సంజయ్‌ వెల్లడించారు. కాగా, మండుటెండలో పాదయాత్ర కొనసాగించడంతో బండి సంజయ్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో మజ్జిగ, నీళ్లు తాగి.. కాసేపు సేదతీరి.. తిరిగి పాదయాత్ర ప్రారంభించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement