నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు... | Sakshi
Sakshi News home page

నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...

Published Mon, Apr 29 2024 7:41 AM

TDP MLA Gana Babu Intimidation Politics In Visakhapatnam

నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు. ఈ ఎన్నికల్లో మీరు సపోర్ట్‌ చేయకపోతే నా గూండాయిజం మళ్లీ చూస్తారు. నా వెంట లేకపోతే మీ అంతు చూస్తా.. ఖబడ్దార్‌.. ఈ డైలాగ్‌లు ఏదో యాక్షన్‌ సినిమాలో వీధి రౌడీ చెప్పిన మాటలు కాదు.. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు గుణవంతుడని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అక్రమాల గణబాబు హెచ్చరికలు. ఓటమి భయంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగైతే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారో.. అదే తానుముక్కైన గణబాబు కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు.  

సాక్షి, విశాఖపట్నం : ప్రచారం పేరుతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గణబాబు వస్తున్నాడంటే వ్యాపారులు బెదిరిపోతున్నారు. చిన్న చిన్న దుకాణదారులు హడలిపోతున్నారు. బడా బంగారు వ్యాపారులు భయపడుతున్నారు. ఆర్‌పీ లు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై తోపుడు బళ్లు వ్యాపారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరు కనిపించినా..  నవ్వుతూ పలకరిస్తూ.. ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్‌ ఓటర్లను అభ్యర్థిస్తుంటే.. టీడీపీ అభ్యర్థి గణబాబు మాత్రం బెదిరింపు రాజకీయాలతో బెదరగొడుతున్నారు.

బెదిరింపులకు నాలుగు బ్యాచ్‌లు 
ఎన్నికల్లో తనకు సహకరించకపోతే భవిష్యత్‌లో సమస్యలు తప్పవని గణబాబు.. నియోజకవర్గంలోని వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల యజమానులను బెదిరిస్తున్నారని కొందరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారులను బెదిరించేందుకు గణబాబు తన అనుచరులను నాలుగు బ్యాచ్‌లుగా విభజించి.. వస్త్ర వ్యాపారుల ను ఒక బ్యాచ్, బంగారు వ్యాపారులను మరో బ్యాచ్, కిరాణా దుకాణాలవైపు ఇంకో బ్యాచ్, మిగిలిన వాటిని కవర్‌ చేస్తూ మరో బ్యాచ్‌ పశ్చిమ నియోజకవర్గంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆయా వర్తక సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను గణబాబు రప్పించుకొని వేలు చూపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తి గెలిస్తే నియోజకవర్గాన్ని గూండాల చేతిలో పెట్టేటట్లుగా ఉన్నారంటూ వ్యాపారులు హడలిపోతున్నారు.

ఫిర్యాదులు చేస్తామని ఆర్పీలకు బెదిరింపు 
స్వయం సహాయక బృందాల్లో కీలకంగా వ్యవహరించే రిసోర్స్‌ పర్సన్స్‌(ఆర్పీ) ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయకుండా వ్యవహరిస్తున్నారు. అయితే.. వీరిపైనా గణబాబు బెదిరింపుల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవలే కొందరు ఆర్పీలను మభ్యపెట్టేందుకు కాసులపేర్లను బహూకరించారు. ఆర్పీలు తీసుకోమని చెప్పడంతో వారందర్నీ బెదిరించారు. దీంతో ఒకరిద్దరు గణబాబు గూండాయిజానికి భయపడి తీసుకున్నారు. మిగిలిన వారు మాత్రం తాము ఏ పార్టీకి సపోర్ట్‌ చేయమనీ.. స్వయం సహాయక బృందాల అభివృద్ధి కోసమే తమని ప్రభుత్వాలు నియమించాయని కరాఖండిగా చెప్పడంతో గణబాబు అహం దెబ్బతింది.

దీంతో తనకు సహకరించని ఆర్పీలపై గణబాబు వర్గం ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేయడం ప్రారంభించింది. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోల్ని సంపాదించి.. ఆ ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని కొందరు ఆర్‌పీలు వాపోతున్నారు. పాత ఫొటోల ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముందుగా ఆర్పీలకు ఆ ఫొటోలు చూపించి.. మీరు తన తరఫున ప్రచారం చేయకపోతే.. ఈ ఫొటోలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాననీ.. అప్పుడు మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ గణబాబు  బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గణబాబు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గాన్ని కుదిపేస్తున్నాయి. దిగజారుడు బెదిరింపులతో చిల్లర రాజకీయాలు చేస్తున్న గణబాబు అరాచకాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు.  
 

Advertisement
Advertisement