
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో పోలీసులు మరోసారి హై డ్రామాకు తెరలేపారు. తాజాగా తాడిపత్రి వదిలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల పదో తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించడం గమనార్హం.
వివరాల ప్రకారం.. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈనెల పదో తేదీన అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు ఆ కార్యక్రమంలో పాల్గొంటారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రికి రావాలని పెద్దారెడ్డికి పోలీసులు చెప్పారు.
ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి స్పందిస్తూ.. దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని కోరారు. కానీ, లేఖ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమానాస్పద వైఖరిని పెద్దారెడ్డి ప్రశ్నించారు. అనంతరం, అనంతపురం ఎస్పీ జగదీష్‌కు కేతిరెడ్డి మెయిల్ పంపించారు. సీఎం పర్యటన అనంతరం తాడిపత్రి వస్తానని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి.. శనివారం ఉదయం తాడిపత్రిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.
