
సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకున్నారు. పోలీసు భద్రత మధ్య తాడిపత్రిలోని స్వగృహానికి వెళ్లారు పెద్దారెడ్డి. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి భద్రత కల్పించారు. ఇక, కేతిరెడ్డి పెద్దారెడ్డి రాక సందర్భంగా 672 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి హారతి ఇచ్చి దిష్టి తీశారు కుటుంబ సభ్యులు.
వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు 15 నెలల తర్వాత తాడిపత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అంతకుముందు.. తాడిపత్రి వెళ్లటంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి మాట్లాడుతూ..‘15 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్లటం ఆనందంగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తాను. తాడిపత్రి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తాను. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తాను’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
