
అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అయితే, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉందనే కారణంగానే పెద్దారెడ్డిని అడ్డుకున్నట్టు పోలీసులు చెప్పడం గమనార్హం.
తాజాగా డీఎస్పీ వెంకటేషులు మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉంది. అందుకే నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నాం. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుంది. అన్ని విషయాలు హైకోర్టుకు విన్నవిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో, జేసీ కోసమే పెద్దారెడ్డి అడ్డుకున్నట్టు పోలీసులు బహిరంగంగానే ప్రకంటించేశారు.
మరోవైపు.. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు.. ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలి అంటూ హెచ్చరించారు. దీంతో, పెద్దారెడ్డి ఇంటిని కూల్చి ప్లాన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి సహా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో పెద్దారెడ్డి మాట్లాడుతూ.. జేసీ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారు. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తాను. పోలీసులకు జీతాలు ఇచ్చేది జేసీనా లేక ప్రభుత్వామా?. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టే పోలీసులు పనిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారు. నేను గతంలో ఫ్యాక్షనిజం చేయలేదు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.
ఇక, తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు వాహనాల్లో తాడిపత్రి వెళ్తున్నప్పటికీ, హైకోర్టు ఆదేశాలు చూపించినా.. బారికేడ్లు పెట్టి ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాలయాపన చేసి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకునే కుట్రలు పోలీసులే చేయడం గమనార్హం.
