స్టాలిన్‌-పళనిది కలేనా? | Stalin Palani Doubt Vijays Daring Faith, TVK Fires Back At Collapse Rumours, Says Our Coalition Is Built On Ideology Not Power | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌-పళనిది కలేనా?

May 23 2026 7:47 AM | Updated on May 23 2026 10:50 AM

Stalin Palani doubt Vijays daring faith

ఆరు దశాబ్దాల తమిళనాడు రాజకీయ చరిత్రలో.. తొలిసారిగా ఏర్పడిన సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఎంతకాలం నిలుస్తుంది?. సీఎం విజయ్‌ నేతృత్వంలోని టీవీకే సర్కార్‌ కొలువుదీరి రెండు వారాలు గడవక ముందే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకేలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అంటూ ప్రకటలు చేస్తున్నాయి. వీటిపై టీవీకే స్పందించింది. “మాకు అధికార అనుభవం తక్కువ కావొచ్చు.. కానీ సిద్ధాంతాల విషయంలో మా నిబద్ధత చాలా బలంగా ఉంది” అంటూ ఘాటు బదులే ఇస్తోంది. 

ఇంతకాలం డీఎంకే, అన్నాడీఎంకేలు ద్రవిడ సిద్ధాంతం పేరు చెప్పుకుని ప్రజలను మభ్యపెట్టాయని.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని టీవీకే నేత, తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి అరుణ్‌రాజ్‌ ఆరోపించారు. అయితే.. విజయ్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం “సామాజిక న్యాయం, లౌకికవాదం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ” అనే ఉమ్మడి సిద్ధాంతాలపై ఏర్పడిందని, కాబట్టి ఆ ఆలోచనలే ఉండబోవని చెప్పారాయన. చెన్నైలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలుతుందన్న ప్రతిపక్షాలకు కౌంటర్‌ కూడా ఇచ్చారు. 

డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలో, అవినీతికి ఎలా వాడుకోవాలో బాగా నేర్చుకున్నాయి. అందుకే మాకు ప్రజలు ఓటేసి గెలిపించారు. మా కూటమి సాధారణ రాజకీయ పొత్తు కాదని, సిద్ధాంతాల కలయిక అని స్పష్టం చేశారు. టీవీకే, ఐయూఎంఎల్‌, వీసీకే కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం బయట నుంచి వామపక్షాల మద్దతుతో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాల అసెంబ్లీలో ఈ కూటమికి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే బయట మద్దతు భవిష్యత్తులో సమస్య అవుతుందన్న వాదనను అరుణ్‌రాజ్‌ ఖండించారు. 

“ప్రజలకు మంచి పాలన అందిస్తే.. ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కాబట్టి ప్రతిపక్షాలది కలే అని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఇంతకాలం కూటములతో అధికారంలోకి వచ్చినా.. భాగస్వామ్య పార్టీలకు పాలనలో వాటా ఇవ్వలేదు. కానీ మా(టీవీకే పార్టీ) అధినేత విజయ్‌ మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారాన్ని పంచుకున్నారని చెప్పారు. దీనిని ఆయన “ప్రజాస్వామ్యానికి నిజమైన గౌరవం”గా అభివర్ణించారు. ఈ కారణాల వల్లే మా అధినేత కూడా అదే ధీమాతో ఉన్నారని అరుణ్‌ చెప్పుకొచ్చారు.  

కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా టీవీకే ప్రభుత్వం వెనక్కి తగ్గదని అరుణ్‌రాజ్‌ స్పష్టం చేశారు. విద్యా నిధుల విడుదల, వన్‌నేషన్‌-వన్‌ ఎలక్షన్‌, సీఏఏ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. అయితే ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికీ సిద్ధమేనన్నారు.

ఆరోగ్యశాఖ మంత్రిగా తన తొలి లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమేనని చెప్పారు. “డబ్బు లేక అప్పులు చేసినా ప్రజలు ప్రైవేట్‌ ఆసుపత్రులకే వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం తగ్గింది. దాన్ని మళ్లీ పెంచాలి” అని అన్నారు.

ఇదిలా ఉంటే.. విజయ్‌ తన కేబినెట్‌ విస్తరణను కూడా పూర్తి చేశారు. వీసీకే నుంచి ఓ దళిత నేత, ఐయూఎంఎల్‌ నుంచి మరో నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ‘రెయిన్‌బో క్యాబినెట్‌’ను విజయ్‌ రూపొందించారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement