సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తోంది రాద్ధాంతమేనని.. మహిళా రిజర్వేషన్ల బిల్లు అడ్డుకోవడమే వాళ్ల ధ్యేయంగా కనిపిస్తోందని బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన విపక్షాలపై ధ్వజమెత్తారు.
1996 నుంచి మహిళా రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వాలు ఈ బిల్లును విస్మరించాయి. కానీ, ప్రధాని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలందరి తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు. కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆలస్యమయ్యేలా ప్రతిపక్షాలు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి.
రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నాయి. తమిళనాడులోనూ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. కానీ, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. డీలిమిటేషన్ వద్దని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ, అదే జరిగితే కేరళలో పది సీట్లు పెరుగుతాయి. ఇది కేరళకు లాభమే గానీ నష్టం కాదు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలో అర్థమే లేదు.
డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోంది. ఈరోజు కోసం దేశం 40 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. 2029లో అమలయ్యే మహిళా రిజర్వేషన్లతో దేశం అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. సూర్యనారీశక్తి బిల్లును విపక్షాలు అడ్డుకోవడం సరికాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చావడానికైనా నేను సిద్ధం’’ అని తేజస్వీ సూర్య ప్రసంగించారు.

సీఎం రేవంత్ ప్రతిపాదనపై స్పందిస్తూ..
డీలిమిటేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాదనను చర్చ సందర్భంగా తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ‘‘రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన హైబ్రిడ్ వాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. జీఎస్‌డీపీ ఆధారంగా సీట్ల సంఖ్య పెంచమని రేవంత్ అన్నారు. ఆ సలహా ఆయనకు ఎవరు ఇచ్చారో తెలియదు. ఆయనత ఎచ్చిన ప్రతిపాదన ఫూలిష్‌గా ఉంది. జీఎస్‌డీపీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఆ లెక్కన సీట్ల సంఖ్య మారుతూ ఉండాలా?. ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం.. ఒకరికి ఒక్క ఓటే ఉంటుంది. డీలిమిటేషన్ ఏపీ, తెలంగాణలో 52 శాతం సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 49 సీట్లు పెరుగుతున్నాయి. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో 23.9 శాతం సీట్లు పెరుగుతాయి. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపు అనేది రాజ్యాంగబద్ధమే. డీలిమిటేషన్‌తో సీట్ల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయమే జరుగుతుంది’’ అని తేజస్వీ అన్నారు.


