నేడు కాంగ్రెస్‌ కీలక సమావేశం

Sonia Gandhi Convenes Meet Today, To Plan Protests Against Govt - Sakshi

సోనియా అధ్యక్షతన వర్చువల్‌ భేటీ 

హాజరుకానున్న పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇంఛార్జ్‌లు 

దేశంలోని తాజా పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు, ఇతర అంశాలపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన గురువారం కీలక సమావేశం జరుగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లతో పాటు, పీసీసీ అధ్యక్షులు వర్చువల్‌గా జరిగే ఈ సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో పాటు కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ప్రజలకు అంబులెన్సులు, ఔషధాలు, ఆక్సిజన్, హాస్పిటల్‌ బెడ్స్‌ను అందించే విషయంలో సహాయపడేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించిన కోవిడ్‌– 19 ఔట్‌రీచ్‌ కార్యక్రమం గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని మరో సీనియర్‌ నాయకుడు పేర్కొన్నారు. వీటితో పాటు దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడం వంటి పలు కీలక అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకమైన నిరసన తెలపాలనే ప్రణాళికను రూపొందించేందుకు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అంతేగాక జూలైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పలు అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంతోపాటు, ఈ అంశాలను ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలనే అంశంపై చర్చిస్తారని తెలిసింది. మరోవైపు గత ఏడాది పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ దాడి కొనసాగిస్తోంది. ఏడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతులతో చర్చలు ఆగిపోయిన నేపథ్యంలో ఈ అంశంపై అనుసరించాల్సిన ప్రణాళిలపై కసరత్తు చేయనున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top