ఉత్కంఠ.. కమల్‌నాథ్‌కు మద్దతుగా ఢిల్లీకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు!

Several Mlas Loyal To Kamal Nath Reach Delhi Amid Talk Of Switch To Bjp - Sakshi

భోపాల్‌: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా?. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, అతని కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌తో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గుప్పు మంటున్నాయి. ఈ క్రమంలో కమల్‌నాథ్‌ వర్గం ఎమ్మెల్యేలు కొందరు ఆదివారం ఢిల్లీకి చేరుకోవడంతో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లోని రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వీరంతా పార్టీ హైకమాండ్‌ ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు, కమల్‌నాథ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడరంటూ తెలిపిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌.. ‘ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడి ఆయన పార్టీ మారే వ్యక్తి కాదని.. అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టిపారేశారు.

కాగా, కమల్‌నాథ్‌కు మాజీ మీడియా సలహాదారు, ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అయిన నరేంద్ర సలూజా.. కమల్‌నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా కాంగ్రెస్‌ ఎంపీ నకుల్‌నాథ్‌లతో దిగిన భోపాల్‌లో దిగిన ఒక ఫొటోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేసి దానికి ‘జై శ్రీరామ్‌’ అని ట్వీట్‌చేశారు. దీంతో తండ్రీకొడుకులు కమలం గూటికి చేరుకుంటున్నారని వార్తలు మొదలయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ నకుల్‌నాథ్‌ తన ‘ఎక్స్‌(పాత ట్విట్టర్‌)’ ఖాతా వివరాల్లో కాంగ్రెస్‌ పదాన్ని తొలగించారు. ముందస్తు షెడ్యూల్‌ లేకుండా హడావుడిగా ఇద్దరూ ఢిల్లీకి వచ్చారు. రాగానే మీడియా కమల్‌ను ప్రశ్నించింది.

మీరు పార్టీ మారుతున్నారా? అన్న ప్రశ్నకు ‘‘అలాంటిదేమైనా ఉంటే ముందు మీకే చెబుతా’ అని అన్నారు గానీ పార్టీని వీడట్లేదనే సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజ్యసభ సీటు ఆశించి భంగపడినందుకే కమల్‌నాథ్‌ పార్టీని వీడుతున్నారని మరో విశ్లేషణ వినిపించింది. బీజేపీలోకి వస్తామంటే ఇప్పుడే మీకు స్వాగతం పలుకుతామని మధ్యప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ వీడీ శర్మ శుక్రవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. గత ఏడాది మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు కమల్‌నాథ్‌ బాధ్యుడని రాహుల్‌ భావిస్తున్నారని, అందుకే కమల్‌ను తప్పించి జీతూ పట్వారీకి కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌ చీఫ్‌ పదవి కట్టబెట్టారని వార్తలొచ్చాయి.  

ఇదీ చదవండి: అత్యంత ప్రజాదారణ కలిగిన సీఎం ఎవరో తెలుసా?

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top