రాష్ట్రంలో మార్పు తప్పదు

Revanth Reddy comments over brs - Sakshi

ఈసారి బైబై కేసీఆర్‌కు.. అధికారం కాంగ్రెస్‌కు..

రామగుండం, ధర్మపురి, బెల్లంపల్లి విజయభేరి సభల్లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

సాక్షి, పెద్దపల్లి/ ధర్మపురి/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బైబై చెప్పి, కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడానికి సిద్ధమయ్యారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు కష్టాలు పడుతున్నారని, పదో తరగతి నుంచి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దాకా ఏ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేని దుస్థితి ఉందని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు కేవలం కేసీఆర్‌ కుటుంబం, చుట్టాలను ముఖ్యమంత్రులు, మంత్రులు చేసేందుకే ఉన్నారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలుచేస్తామని, చేతి గుర్తుకు ఓటువేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, జగిత్యాల జిల్లా ధర్మపురిలలో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిందేమీ లేదు. రాష్ట్రం ఇస్తే ప్రజల జీవన విధానం మారుతుందని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సోనియాగాంధీ భావించారు. కానీ కేసీఆర్‌ పాలనలో ఈ ఆశలకు పాతరేశారు.

‘మేడిగడ్డ’కుంగింది.. ‘అన్నారం’పగిలింది
లక్షన్నర కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నిరుపయోగం. ఇసుక కదిలిందని అధికారులు చెప్తున్నారు. బుద్ధి ఉన్నవారెవరైనా ఇసుక మీద ప్రాజెక్టు కడతారా? పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తగిలి కూలిపోయినట్టు ఉంది. రూ.35 వేల కోట్లతో కట్టాల్సిన ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లకు పెంచారు.

సీఎం కేసీఆర్‌కు ఆకలి ఎక్కువ. ఆలోచన తక్కువ. 60ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికీ లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. మూడేళ్ల కింద కట్టిన ‘మేడిగడ్డ’కుంగింది ‘అన్నారం’పగిలింది. ఈ ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. అధికారంలోకి రాగానే వాటిని కక్కిస్తాం. ప్రజలను దోచుకుతింటున్న సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 

ఆదిలాబాద్‌ను మోసం చేశారు
వైఎస్సార్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి కేంద్రంగా చేపట్టారు. దాన్ని అలాగే కొనసాగిస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1.60లక్షల ఎకరాలకు సాగు నీరందించేది. కానీ సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించి ఆదిలాబాద్‌ జిల్లాను మోసం చేశారు. 2004లోనే వైఎస్సార్‌ రైతులకు ఉచిత విద్యుత్‌ను అమల్లోకి తెచ్చారు. ఈ పథకంపై పేటెంట్‌ కాంగ్రెస్‌దే. ధరణి లేకుంటే రైతుబంధు ఎలాగని కేసీఆర్‌ అంటున్నారు. మేం అంతకంటే మెరుగైన సాధనం రూపొందించి రైతులను ఆదుకుంటాం.

సింగరేణిలో గెలవలేక..
ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని మూయి స్తానన్న సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు ఎక్కడికిపోయా రు? గనుల్లో ఇసుక, బొగ్గు, బూడిద ఏదీ వదలకుండా దోచుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ బందిపోటు దొంగలా మారారు.

ఆయన కేసీఆర్‌ బిడ్డకు, కల్వకుంట్ల కుటుంబానికి కప్పం కడుతున్నాడు కాబట్టే మళ్లీ టికెట్‌ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచే సత్తా కేసీఆర్‌కు లేదు. అందుకే కోర్టుకు వెళ్లి వాయి దా తెచ్చుకున్నారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్‌ దొరికితే బొగ్గుబావుల్లో పాతరేస్తారు. గతంలో సింగరేణి మూతపడే స్థితిలో ఉన్నప్పుడు కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చేసి ఆదుకున్నారనే విష యాన్ని కార్మికులు మరిచిపోవద్దు.

ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టిస్తున్నారు.
2018 ఎన్నికల్లో ధర్మపురిలో శ్రీలక్ష్మినరసింహుడి దయతో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ గెలిచినా.. ఈవీఎంలను మార్పించిన ఘనత మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కు దక్కింది. ఓట్లను రీకౌంటింగ్‌ చేయాలని కోర్టు ఆదేశాలిస్తే అధికారులు స్ట్రాంగ్‌ రూంల తాళాలు పోయననడం సిగ్గుచేటు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దుర్మార్గాలు చేస్తున్నారు. మా సభకు కరెంట్‌ సర ఫరా కట్‌ చేయించారు. ప్రజలు ఎన్నికల్లో మీకు కరెంట్‌ లేకుండా కట్‌చేస్తారు.

ఎమ్మెల్యే బాల్క సు మన్‌ ఇసుక, సింగరేణి ఉద్యోగాలు, హైదరాబాద్‌లో భూముల కబ్జాలు చేస్తున్నారు. నూరు కేసులు ఉన్నా యని చెప్పిన సుమన్‌.. ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారు? అవినీతిపై నిలదీసిన ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నా రు.’’అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

గోదావరిఖని సభలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, రామగుండం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్, ఐఎన్‌టీయూఈ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్, ధర్మపురి సభలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్‌ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, బెల్లంపల్లి సభలో మాజీ ఎంపీ వివేక్, నేతలు వినోద్, నల్లాల ఓదెలు, ఏఐటీ యూసీ నాయకుడు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top