రాజీవ్‌ వర్ధంతి: 1991 మే 21న ఏం జరిగింది? | Rajiv Gandhi 33rd Death Anniversary: Know About What Happened On May 21st 1991, More Details | Sakshi
Sakshi News home page

Rajiv Gandhi Death Anniversary: 1991 మే 21న ఏం జరిగింది?

May 21 2024 9:08 AM | Updated on May 21 2024 11:21 AM

Rajiv Gandhi Death Anniversary

ఈరోజు(మే 21) భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. మే 21న ప్రతి ఏటా ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్‌ గాంధీ.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడిలో హతమయ్యారు. ఆత్మాహుతి బాంబర్ బెల్ట్ బాంబును ప్రయోగించారు. రాజీవ్ గాంధీతో పాటు అక్కడున్న పలువురు హతమయ్యారు.

రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూర్ ఎన్నికల సభలో పాల్గొనేముందు ప్రజల అభివాదాలను స్వీకరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తన దుస్తులలో పేలుడు పదార్థాలను దాచుకున్న లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం (ఎల్‌టీటీఈ)కు చెందిన మహిళా సభ్యురాలు రాజీవ్ గాంధీ పాదాలను తాకి, బాంబును పేల్చివేసింది. వెంటనే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు భారీ ఎత్తు పొగ బెలూన్‌లా పైకి లేచింది. ఈ ఘటనలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీతో సహా పలువురు అక్కడికక్కడే మృతిచెందారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు.

రాజీవ్ గాంధీ హత్యానంతరం విపి సింగ్‌ ప్రభుత్వం మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థలలో ఉగ్రవాదాన్ని నిర్మూలనకు పాటుపడతామని ప్రమాణం చేస్తారు. అలాగే, ఈ రోజుకు గల ప్రాముఖ్యతను వివరిస్తూ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా ఉగ్రవాద వ్యతిరేక సందేశాలు పంపిస్తారు.

భారత ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం తన 40 ఏళ్ల వయస్సులో దేశానికి ప్రధాని అయ్యారు. తన పదవీ కాలంలో రాజీవ్‌ పలు గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. అవి నేడు ఎంతో ఉపయోగకరమైనవిగా నిరూపితమయ్యాయి.

రాజీవ్ గాంధీ 1986లో జాతీయ విద్యా విధానాన్ని దేశమంతటా విస్తరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించారు. రాజీవ్‌ గాంధీ దేశంలో సైన్స్ అండ్‌ టెక్నాలజీని ఎంతగానో ప్రోత్సహించారు. దేశంలో కంప్యూటర్ల వినియోగానికి ఊతమిచ్చారు. సూపర్ కంప్యూటర్ల రూపకల్పనకు ప్రోత్సాహాన్ని అందించారు.     దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసేందుకు ప్రయత్నించారు. పారిశ్రామిక ఉత్పత్తిని పెంచేందుకు అనేక కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement