‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం  | Rahul Gandhi Fires On PM Narendra Modi And CM KCR | Sakshi
Sakshi News home page

‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం 

Published Mon, Nov 27 2023 4:27 AM | Last Updated on Mon, Nov 27 2023 4:15 PM

Rahul Gandhi Fires On PM Narendra Modi And CM KCR - Sakshi

సాక్షి, కామారెడ్డి/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ప్రజల తెలంగాణ కల సాకారం కాబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది. తొలి మంత్రిమండలి సమావేశంలోనే ఆరు గ్యారంటీలను చట్టబద్ధం చేసి అమలు చేస్తాం’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సంపదను అంతా ఒకే కుటుంబం అనుభవిస్తోందని, రీడిజైన్‌ పేరుతో ఒక్క ప్రాజెక్టుతోనే రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

ఈ మధ్య తాను మేడిగడ్డకు వెళ్లి చూడగా పునాదులు పగిలిపోయి, డ్యాం లోపలికి కుంగిపోయి కనిపించిందన్నారు. కాళేశ్వరం కట్టింది నీళ్ల కోసం కాదని, దోచుకోవడం కోసమేనన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా లక్షలాది మంది రైతుల భూములను తమవారికి ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కామారెడ్డి, సంగారెడ్డి, ఆందోల్‌లో నిర్వహించిన సభల్లో రాహుల్‌ ప్రసంగించారు. ఆదాయం వచ్చే ల్యాండ్, లిక్కర్, ఇరిగేషన్, ఇసుక లాంటి శాఖలన్నీ తమ చేతుల్లో పెట్టుకుని, ఇష్టారీతిన దోచుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో 8 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ప్రధాని మోదీకి లోక్‌సభలో అవసరం ఉన్నప్పుడల్లా అండగా నిలవడం వల్లే కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ లాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఒకవేళ కేసీఆర్‌ మద్దతు ఇవ్వకపోయి ఉంటే సీఎం కురీ్చకీ ఎసరొచ్చేదని రాహుల్‌ దుయ్యబట్టారు. 
 
తొలి సమావేశంలోనే... 
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ప్రతినెలా బ్యాంకు ఖాతాలో రూ. 2,500 జమ చేస్తామని, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా నెలకు రూ.5 వేల మేరకు ప్రయోజనం కల్పిస్తామని, గ్యాస్‌ సిలిండర్‌ను రూ.ఐదు వందలకు ఇస్తామని, రైతులకు రైతుభరోసా ద్వారా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, అలాగే రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తామని తెలిపారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తామని, ఇళ్లు లేనివారందరికీ రూ.5 లక్షలు ఇచ్చి సొంతింటి కల నిజం చేస్తామని చెప్పారు.

తెలంగాణ కోసం ప్రాణాలొదిలిన అమరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్‌ తీసుకుంటున్నారని, తాను వాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడానని రాహుల్‌ చెప్పారు. విద్యాభరోసా కార్డులను ఇచ్చి, వారి ఉన్నత చదువులు, కోచింగ్‌ కోసం రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంటికి చేరేలోపు పరీక్ష పత్రాలు లీకైనట్టు తెలిసి గుండెలు బాదుకోవలసిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. 
 
అవినీతి సొమ్ము ప్రజల ఖాతాల్లోకి.. 
తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కక్కించిన ఈ సొమ్మును నిరుపేదల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనన్నారు. బీజేపీతో కాంగ్రెస్‌ పోరాడిన ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దించి బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నష్టం చేసేలా అస్సాం, గోవా, రాజస్తాన్‌ ఎన్నికలో ఎంఐఎం వ్యవహరించిందని గుర్తుచేశారు.

బీజేపీతో పోరాడుతున్నందుకు తనపై 24 కేసులు నమోదు చేశారని, తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, తన నివాసాన్ని కూడా లాక్కున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న మోదీ సర్కానూ వదిలిపెట్టేది లేదన్నారు. విద్వేషాల బజార్‌లో ప్రేమ అనే దుకాణం తెరిచిన కాంగ్రెస్‌కు మద్దతు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, నిజామాబాద్‌ అర్బన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి అభ్యర్థులు షబ్బీర్‌అలీ, ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.మదన్‌మోహన్‌ పాల్గొన్నారు. 
 
కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది
‘ప్రజల రక్తానికి మరిగిన పులిని వేటాడేందుకు వేటగాన్ని రంగంలోకి దింపుతారు. అట్లనే తెలంగాణ సంపదను దోచుకుంటున్న కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టేందుకే నన్ను ఇక్కడికి పంపారు. కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. దేశం మొత్తం మీవైపే చూస్తోంది’ అని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన విజయభేరి సభలో ఆయన మాట్లాడారు.

నలభై ఏళ్లుగా ఎన్నో పదవులు అనుభవించినప్పుడు గుర్తుకురాని అమ్మ, అమ్మమ్మ ఊరు కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. గల్ఫ్‌ కార్మీకుల కష్టాలను కేసీఆర్‌ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక్కడి భూముల మీద కన్నేసి కామారెడ్డికి వచ్చారని, కేసీఆర్‌ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement