
కూటమి పాలనలో ఎల్లో మీడియా రెచ్చిపోతూనే ఉంది. తాజాగా.. టీడీపీ కరపత్రిక ఈనాడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి విషం చిమ్మింది. తీవ్ర ఆరోపణలు.. పచ్చి అబద్ధాలతో.. నిసిగ్గుగా ఓ కథనం ఇచ్చింది. ఈ క్రమంలో.. సంబంధం లేని అంశాలను జోడించి ప్రజల్లో అపోహలు కలిగించే తీవ్రంగా ప్రయత్నం చేసింది.
లాయర్, ప్రముఖ వ్యాపారవేత్త అయిన సునీల్ రెడ్డిని మద్యం కేసులో సిట్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన కార్యాలయాల్లో సోదాల పేరుతో హైడ్రామా నడిపించింది. సోదా సమయంలో సిట్ సభ్యులు తమతో పాటు లోపలికి ఓ బ్యాగ్ తీసుకెళ్లడం, అలాగే ఓ ప్రైవేట్ వాహనం రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాహనంలో ఉన్న వస్తువులను కార్యాలయంలోకి చేరవేసి.. మద్యం కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారనే ఆ అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి.
ఒకవైపు తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్ నానాతిప్పలు పడుతుంటే.. మరోవైపు తప్పుడు కేసు కోసం ఈనాడు పచ్చి అబద్ధాలు రాస్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ పదవులు చేపట్టని సునీల్‌రెడ్డి అనే వ్యక్తిని.. జగన్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన కోసం డొల్ల కంపెనీలు సృష్టించారంటూ కథనాలు అచ్చేసింది. ఇక..
చంద్రబాబు విసిరే బిస్కెట్ల కోసం ఇంతకు ముందూ జగన్, వైఎస్సార్‌సీపీ నేతలపై పలు అవాస్తవ కథనాలు ప్రచురించింది. మార్గదర్శి అక్రమాలపై చంద్రబాబు విచారణ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాబు ప్రాపకం కోసం ఈనాడు బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తాజా కథనం కూడా బాబుకు అనుకూలంగా, జగన్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అల్లేసిందనేనని వైఎస్సార్‌సీపీ అంటోంది.
మీడియా స్వేచ్ఛ అనే పదాన్ని ప్రత్యర్థులపై విషం చిమ్మేందుకు వేదికగా మార్చుకున్న ఈనాడు.. రాజకీయ అనుకూలత కోసం నిజాన్ని వక్రీకరించడంలో మరోసారి తన పాత్రను బహిరంగం చేసుకుందనే విమర్శ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది.
