‘తిరుపతి సభ విజయోత్సవం కాదు.. వెన్నుపోటు ఉత్సవం’ | Mla Tatiparthi Chandrasekhar On Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘తిరుపతి సభ విజయోత్సవం కాదు.. వెన్నుపోటు ఉత్సవం’

Jun 13 2026 9:00 PM | Updated on Jun 13 2026 9:03 PM

Mla Tatiparthi Chandrasekhar On Chandrababu Government

సాక్షి, తాడేప‌ల్లి: తిరుపతిలో ఈ నెల 12న కూట‌మి ప్ర‌భుత్వం నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభ వాస్తవానికి విజయాలను చెప్పుకునే సభ కాదని, ఆరు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిప‌డ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రంలో ప్రస్తుతం "క్యాష్–రాజేష్–లోకేష్" ఫార్ములాతో పాలన సాగుతోందని ఆరోపించిన ఆయన, డీఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌మీట్‌లో తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ ఏమ‌న్నారంటే..

అది వెన్నుపోటు పొడిచిన సభ
తిరుపతిలో ఈ నెల 12న‌ జరిగినది కూట‌మి ప్ర‌భుత్వ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ. చంద్రబాబు రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏంటో గూగుల్‌లో వెతికినా కనిపించవు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకోవడం పరీక్ష రాయకుండానే పాస్ అయినట్లు ఉంది. ఆ రోజు సూపర్ సిక్స్ అన్న చంద్రబాబు, ఈ రోజు సూపర్ సైలెంట్ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోను మూసేసి ఎర్రబుక్ పాలన ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ పని జరగాలన్నా 'క్యాష్–రాజేష్–లోకేష్' అనే కొత్త ఫార్ములానే అమలవుతోంది. రాజేష్ స్కెచ్ వేస్తే, లోకేష్ దాన్ని అమలు చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రాష్ట్ర వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.

డీఎస్సీపై సమాధానం చెప్పలేని మంత్రి రాష్ట్రాన్ని నడిపిస్తారా?
డీఎస్సీ -2025 వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై ప్రెస్‌మీట్ పెట్టి సమాధానం చెప్పలేని వ్యక్తి మంత్రి ఎలా అవుతారు? డీఎస్సీ అక్రమాలపై వివరణ ఇవ్వలేని స‌క‌ల విఫ‌ల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారా? అలాంటి వ్యక్తి విజయోత్సవ సభ వేదికపై నిలబడి వైఎస్‌ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. దూకుడు సినిమాలో బ్రహ్మానందం పాత్రను ఎలా ఉపయోగించారో, అలాగే చంద్రబాబు–లోకేష్‌లు పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకుంటున్నారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడల్లా పవన్‌ను రంగంలోకి దింపుతున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రత్యర్థులను దూషించడానికే పరిమితమయ్యారు. పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. తిరుపతిలో నిర్వహించిన సభ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వారి ప్రసంగాలే నిరూపించాయి.

సింగిల్ విండో పాలన
రాష్ట్రంలో ప్రస్తుతం 'క్యాష్–రాజేష్–లోకేష్' అనే సింగిల్ విండో పాలన నడుస్తోంది. ఈ కొత్త ఫార్ములాతో పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండేళ్లలోనే చంద్రబాబు రెండు చేతులు ఎత్తేశారు. రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆర్థిక లోటును పెంచి ఖజానాను ఖాళీ చేశారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు చెప్పుకునే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు. నారా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖలో అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అక్కడే రాష్ట్ర తిరోగమనం మొదలైంది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు అప్పగించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయి, ఫలితాలు పడిపోయాయి, పేపర్ లీకులు పెరిగాయి. ఉద్యోగాలు సూట్‌కేసులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. డీఎస్సీలో విద్యాశాఖ ఉద్యోగులకే మొదటి ర్యాంకులు రావడం, గోల్డ్ మెడలిస్టులకు ఉద్యోగాలు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలకు మంగళం పాడారు. సుమారు 20 లక్షల మంది విద్యార్థులను అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఒకవైపు తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని సినిమా డైలాగులు చెబుతుంటే, మరోవైపు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. సొంత పార్టీ నేతల తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

కరెంట్ చార్జీలు తగ్గించినట్లు నిరూపించ‌గ‌ల‌రా?
తిరుపతి విజయోత్సవ సభలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. రెండేళ్లలో ఒక్క రూపాయి అయినా కరెంట్ చార్జీలు తగ్గించినట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేస్తారా? పని కంటే ప్రచారానికే ఈ త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

వైఎస్‌ జగన్‌ పాలనలో సంక్షేమం, పారదర్శకత, గ్రామ స్వరాజ్యం కనిపించాయి. కానీ రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలు, రైతులు, యువత సహా అన్ని వర్గాలను మోసం చేసింది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు హామీలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలి.

ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, అప్పులు–అవినీతితో పాలన సాగిస్తున్నారు. తిరుపతి విజయోత్సవ సభతోనే కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను తానే అంగీకరించుకుందని స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీలపై సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించి తిప్పికొట్టే సమయం ఆసన్నమైందని తాటిపర్తి చంద్రశేఖర్ హెచ్చ‌రించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement