భవిష్యత్తుకు భరోసా! | Sakshi
Sakshi News home page

భవిష్యత్తుకు భరోసా!

Published Sat, Sep 23 2023 2:23 AM

MLA Rajaiah Supports Station Ghanpur MLA Candidate Kadiyam Srihari - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రాజుకున్న వేడి క్రమంగా చల్లబడుతోంది. పార్టీ నేతల మధ్య సయోధ్యకు జరుగుతున్న ప్రయత్నాలు ఒకటొకటిగా కొలిక్కి వస్తున్నాయి. జనగామ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బుజ్జగించిన అధినేత కేసీఆర్‌.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆ నియోజకవర్గం టికెట్‌ ఖరారు చేశారు.

మరోవైపు స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నడుమ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు సమక్షంలో రాజీ కుదిరింది. నర్సాపూర్‌ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనను కూడా రెండు మూడురోజుల్లో తొలగించేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి, పటాన్‌చెరు తదితర నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై కూడా కేటీఆర్‌ దృష్టి సారించారు. జనగామ, నర్సాపూర్‌తో పాటు నాంపల్లి, గోషామహల్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లను మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.  

ఆర్టీసీ చైర్మన్‌ పదవి కావాలన్న ముత్తిరెడ్డి? 
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వెంకట్‌రాంరెడ్డి శుక్రవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి వెళ్లారు. అంతా కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికి టికెట్‌ నిరాకరణకు కారణాలను వివరించిన కేసీఆర్‌.. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సహకరించి ఆయన గెలుపు కోసం పనిచేయాలని సూచించారు.

ప్రస్తుతం ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో ఎమ్మెల్సీగానూ అవకాశం కల్పిస్తానని హామీ ఇ చ్చినట్లు తెలిసింది. అయితే తనకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి కావాలని ముత్తిరెడ్డి కోరగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పల్లా నిర్వహిస్తున్న రైతుబంధు సమితి అధ్యక్ష పదవిని కేసీఆర్‌ ఆఫర్‌ చేసినట్లు సమాచారం. కాగా ముత్తిరెడ్డి బెట్టు వీడిన నేపథ్యంలో జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యరి్థగా పల్లా పేరును కేసీఆర్‌ ఖరారు చేశారు.  

నర్సాపూర్, కల్వకుర్తిపై త్వరలో స్పష్టత 
నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనపై బీఆర్‌ఎస్‌ అధినేత దృష్టి సారించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా టికెట్‌ కోసం పట్టుబడుతుండటంతో అభ్యర్థి ప్రకటనను పెండింగులో పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని మదన్‌రెడ్డి స్పష్టం చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారం అందుబాటులో ఉండాల్సిందిగా ఇద్దరు నేతలకు ప్రగతిభవన్‌ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కల్వకుర్తి టికెట్‌ను ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కూడా శుక్రవారం ప్రగతిభవన్‌ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలిసింది.

కేసీఆర్‌ ఆదేశాల మేరకు కసిరెడ్డి ప్రగతిభవన్‌కు చేరుకున్నప్పటికీ సీఎం ఇతర సమావేశాలతో బిజీగా ఉండటంతో భేటీ వాయిదా పడింది. కసిరెడ్డికి ఒకటి రెండురోజుల్లోనే మరోమారు పిలుపు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. తనను కల్వకుర్తి అభ్యరి్థగా ప్రకటించి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌కు తాను ఖాళీ చేసే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కసిరెడ్డి కోరుతున్నారు.

వరంగల్‌ ఎంపీగా పోటీ చేస్తానన్న రాజయ్య!
స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ విషయంలో నెలకొన్న పంచాయితీ కూడా ప్రగతిభవన్‌ వేదికగా కొలిక్కి వ చ్చింది. ఎమ్మెల్సీ పల్లా శుక్రవారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యరి్థ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వెంటబెట్టుకుని కేటీఆర్‌ వద్దకు వెళ్లారు. సంప్రదింపులు, చర్చల అనంతరం కడియం శ్రీహరి అభ్యరి్థత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు రాజయ్య ప్రకటించారు.

కడియం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని రాజయ్యకు ఇస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే గతంలో శ్రీహరికి వరంగల్‌ ఎంపీగా అవకాశం ఇ చ్చినందున తనకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజయ్య కోరినట్లు సమాచారం. వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశమివ్వాలని రాజయ్య పట్టుబట్టినట్లు సమాచారం.

అయితే కేటీఆర్‌ ఏదో ఒక చట్టసభలో క చ్చితంగా పదవి ఇస్తామని భరోసా ఇవ్వడంతో రాజయ్య అంగీకరించినట్లు తెలిసింది. కేటీఆర్‌తో భేటీ అనంతరం కడియం శ్రీహరి గెలుపు కోసం పనిచేస్తానంటూ రాజయ్య ప్రకటించారు. కాగా పార్టీ నిర్ణయం మేరకు తనకు మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం ధన్యవాదాలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement