సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు రేపు(శుక్రవారం) వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో గెలుపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ మెజార్టీలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘జాబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు పక్కా ఖాయమైంది. ఫలితాల కోసం రేపటి వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఉప ఎన్నికలో 20వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది. పోలైన ఓట్లలో 70 శాతం ఓట్లు కాంగ్రెస్‌కే పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(బీఆర్‌ఎస్) మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉంది. బీఆర్‌ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లు ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి..
- పీపుల్స్ పల్స్ -కాంగ్రెస్ 48శాతం, బీఆర్‌ఎస్-41శాతం, బీజేపీ-6శాతం
- చాణక్య స్ట్రాటజీస్- కాంగ్రెస్-46శాతం, బీఆర్‌ఎస్-43శాతం, బీజేపీ-6శాతం
- హెచ్‌ఎంఆర్ సర్వే.. కాంగ్రెస్-48.3 శాతం, బీఆర్‌ఎస్- 43.18శాతం, బీజేపీ 5.84 శాతం ఓట్లు


