
కాంగ్రెస్ ప్రజలను నమ్మించి మోసం చేసింది.. కేటీఆర్ ఫైర్
పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయం హామీలు ఏమయ్యాయి?
తాగునీరు ఇవ్వకుండా మళ్లీ ట్యాంకర్ల రాజ్యం తేవడం ఏమిటి?
200 యూనిట్లు దాటితే మొత్తం కరెంటు బిల్లు ఎందుకు కట్టాలి?
‘ఎక్స్’లో పోస్ట్ చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో వంద తప్పులు చేసిందని.. నాలుగు కోట్ల మంది ప్రజలను నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగం పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మళ్లీ తిప్పలు పడుతోందని.. సాగునీరు, విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోందని ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
హామీల అమలు ఏది?
కాంగ్రెస్ ఇచ్చి న హామీలు అమలు చేయకపోగా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా కింద రూ.15 వేలు, వరికి రూ.500 బోనస్, ప్రతి మహిళకు రూ.2,500 సాయం వంటి హామీల అమలు ఎప్పుడు? రైతుబంధును సీరియల్‌లా ఎంతకాలం సాగదీస్తారు. మూడు నెలలైనా పెన్షన్లను రూ.4000కు ఎందుకు పెంచలేదు.
ఒకటో తేదీనే ఇస్తామన్న జీతాలు అందరికి ఎందుకు అందడం లేదు. 200 యూనిట్ల వినియోగం దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందు కు కట్టాలి? గృహజ్యోతికి ఏటా రూ.8 వేలకోట్లు అవసరమైతే బడ్జెట్లో రూ.2,400 కోట్లే ఎందుకు పెట్టారు? దళితబంధు పథకాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు? అంబేడ్కర్ అభయహస్తం పథకాన్ని అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు? ఒకే ఒక్కరోజు ప్రజాభవన్‌కు వెళ్లి ఆ తర్వాత ఎందుకు ముఖం చాటేశారు? చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఎందుకు కుట్ర చేస్తున్నారు?
కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు? భూగర్భ జలాలు అడుగంటుతున్నా చెరువులు ఎందుకు నింపడం లేదు?’’ అని ప్రశ్నించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీరు ఇవ్వకపోవడం ఘోరమన్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ రైతుల ఆత్మహత్యలు జరిగే పరిస్థితికి తెరలేపుతున్నారని ఆరోపించారు.
వేళాపాళా లేని కరెంటు కోతలేంటి?
యాసంగి సాగు గణనీయంగా తగ్గినా ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని కేటీఆర్ నిలదీశారు. ట్యాంకర్లతో నీళ్లు పోస్తూ పంటలను కాపాడుకునే దుస్థితి ఎందుకు వచ్చి ందని ప్రశ్నించారు. ‘‘వేళాపాళా లేని కరెంటు కోతలేమిటి? పల్లెలు, పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతరేశారు? నాణ్యత లేని కరెంట్ వల్ల మోటార్లు కాలిపోవడానికి బాధ్యులెవరు? యూరియా కోసం మళ్లీ క్యూలైన్లలో నిలబడే దుస్థితి ఎందుకు తెచ్చారు?
సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారు? మిషన్ భగీరథను మూలన పడేసి.. మళ్లీ ట్యాంకర్ల రాజ్యం తేవడమేంటి? ఉచిత బస్సు ప్రయాణమని ఆశపెట్టి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారా? ఆటోడ్రైవర్ల పొట్టగొట్టి.. ఏటా ఇస్తామన్న రూ.12 వేలు ఎగ్గొడతారా? పదేళ్లు సంతోషంగా ఉన్న నేతన్నల జీవితాలను ఎందుకు ఆగం చేశారు? ఆర్డర్లు ఇవ్వకుండా సాంచాల సంక్షోభాన్ని ఎందుకు సృష్టించారు?’’ అని ప్రశ్నించారు.