రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోతుంది: కేటీఆర్‌ | KTR Comments On Revanth Government Patnam Narender Reddy Arrest | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోతుంది: కేటీఆర్‌

Nov 13 2024 4:56 PM | Updated on Nov 13 2024 6:59 PM

KTR Comments On Revanth Government Patnam Narender Reddy Arrest

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 11 నెలలుగా అరాచక పాలన నడుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోతుందని సెటైర్లు వేశారు. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే రేవంత్ పదవి పోవడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి భరతం పట్టే పనిని కొండగల్ నుంచే మొదలు పెడతామని, కొడంగల్‌లో రేవంత్ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని తెలిపారు.  కొడంగల్‌లో అరెస్టు చేసిన 16 మంది రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

జూబ్లీహిల్స్‌లోని  నివాసంలో పట్నం నరేందర్ రెడ్డి తల్లి, సతీమణీలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ,మహమూద్ అలీ, పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిసి పరామర్శించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. త‌న‌ అల్లుడి కంపెనీ కోస‌మే రైతుల‌పై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జ‌న్యాల‌కు పాల్పడుతున్నార‌ని మండిపడ్డారు

రేవంత్ ఆదేశాలతో కొడంగల్ రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పోలీసులు.. రిమాండ్‌కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయార‌ని కేటీఆర్ తెలిపారు. సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్ట్ అవుతుంటే సీఎం రేవంత్ మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లాడని విమర్శించారు. జాతీయ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహరిస్తూ ఇక్కడ పాలన గాలికి వదిలేశాడని దుయ్యబట్టారు.. ఫార్మా సిటీ పేరుతో ఫోర్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని, అవసరం లేని చోట కూడా భూములు కొని రోడ్లు వేస్తూ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారని మండిపడ్డారు.

మాపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్‌ చెబుతున్నాడు. ఐజీ మాత్రం దాడి జరిగిందంటున్నారు. కానీ ఇది ఇంటలిజెన్స్ వైఫల్యం. కేసులు ఎందుకు పెట్టారు. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి కిడ్నాప్  చేశారు. దాడి జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ ఏదీ? ఉద్దేశ పూర్వకంగా గొడవ సృష్టించి రైతులు భూసేకరణకు సహకరించటం లేదని భూములను గుంజుకునే కుట్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగ్‌ల ఫార్మూలా మాత్రమే తెలుసు. ఈయనకు ఈ రేస్ అంటే ఏంటో తెలుసా..? 

ఏ అర్హత లేకున్నా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి లగుచర్ల గ్రామం వెళ్లి గ్రామస్థూలను బెదిరిస్తున్నారు. రైతులను అరెస్టు చేసి కొట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్న పోలీసులు ఉన్నారా రేవంత్ రెడ్డికి ప్రయివేటు సైన్యంలా ఉన్నారా?. రేవంత్ రెడ్డి అల్లుడి కోసం పేదల భూములు గుంజుకుంటున్నారు. తెలంగాణలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. జాతీయ మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రజాసంఘాలు మానవ హక్కుల సంఘాలు స్పందించాలి. కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ పార్టీ,ఇతర పార్టీలు స్పందించాలి’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement