
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరంతా అదోటైపు!. ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారో.. దూషణలకు దిగుతారో ఆయనకే తెలియనట్లు ఉంటుంది వ్యవహారం. కావాలంటే తాజా మహానాడును ఉదాహరణగా తీసుకోండి. ‘ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులను ఏరివేస్తా’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏంటో.. దానికి రాష్ట్ర రాజకీయాలకు సంబంధం ఏమిటో ఆయనకే తెలియాలి!. రాసిచ్చిన స్క్రిప్ట్‌లేమైనా చదువుతారేమో తెలియదు కానీ.. బాబు గారి ప్రసంగాలు వినేవారికి బీపీ పెరిగిపోవడమైతే గ్యారెంటీ!.
2019 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వదలుకుని ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తున్న రోజులవి. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదన్న గట్టి నమ్మకంతో చెలరేగి పోయారు బాబుగారు!. దేశ ప్రధానిని పట్టుకుని ఉగ్రవాది అన్నారు. ముస్లింలను బతకనివ్వడన్నారు.. అవినీతిపరుడన్నాడు.. ఇంకా ఏమేమో అనేశాడు! భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఏమి ఏలుతాడని ప్రశ్నించారు. ప్రధానిని ఉగ్రవాది అనడమేమిటా? అని అప్పట్లో అందరం బాధపడ్డాం. ఆ మాటకొస్తే మోదీ కూడా బాబు మాటలకు ధీటైన సమాధానమే ఇచ్చారు. అది వేరే సంగతి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ ఇక అస్సలు కలవలేవని అందరూ అనుకున్నారు. కానీ, ఐదేళ్లు గడిచేసరికి ఆ దూషణలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. రెండు పార్టీలూ మళ్లీ కలిసిపోయాయి. రాజకీయమంటే ఇంత నిస్సిగ్గుగా చేస్తారా? అని అందరూ అనుకునేలా చేశాయి. అప్పటిదాకా తిట్టిన బాబు నోరే పొత్తు కుదిరాక ఇంద్రుడు, చంద్రుడని ప్రశంసల రాగం ఎత్తుకుంది. మోదీ కూడా తన వంతుగా చంద్రబాబును భుజానికైతే ఎత్తుకున్నాడు!.
ఈ సంగతి అలా ఉంచితే, చంద్రబాబు ఇప్పుడు ఉగ్రభాష వాడుతున్నారు. కాకపోతే ఈ సారి ఆయన గళమెత్తింది.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పైనే. పోటీదారు కనుక ఏవైనా విమర్శలు చేయవచ్చు. అందులోనూ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయం ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు లేదంటే.. ప్రజల అసంతృప్తి పెరిగి పరిస్థితులు జగన్‌కు అనుకూలంగా మారుతున్నాయన్న కోపమూ కారణం కావచ్చు. అయితే మాట్లాడే మాటలకు కొంత విచక్షణ ఉండాలి. జగన్ ఆర్థిక ఉగ్రవాది అనేందుకు ఆయనకున్న ఆధారమేమిటి?.
2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పుల గురించి చంద్రబాబు ఎన్ని మాటలు మార్చారు?. ఒకసారేమో రూ.14 లక్షల కోట్లని.. ఇంకోసారి రూ.పది లక్షలు అని ఊరూరా అబద్ధాలు ప్రచారం చేసింది ఈయనే. కానీ, తాజా బడ్జెట్‌లో ఈ లెక్క కేవలం రూ.ఆరు లక్షల కోట్లేనని స్పష్టమైంది కదా?. ఈ మొత్తంలోనూ తాను గతంలో చేసిన అప్పులూ ఉన్నాయన్న విషయం కూడా చెప్పకపోవడం మోసం చేసినట్టే కదా?. జగన్ ముఖ్యమంత్రిగా సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే.. చంద్రబాబు ఏడాది కాలంలోనే లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేశారు కదా?. దీన్ని కదా అనాల్సింది ఆర్థిక ఉగ్రవాదం అని?. జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం ఉగ్రవాదం అవుతుందా?. ఒకటి అర మాత్రమే అమలు చేసి అడిగిన వారిపై నోరేసుకోవడం ఉగ్రవాదం అవుతుందా?.
చంద్రబాబు తన ప్రసంగంలో ఇంకో మాటా అన్నారు.. ఒకసారి గెలవడం.. ఒకసారి ఓడటం ఉండకూడదట. అలా అయితే అభివృద్ది జరగదట.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కూడా వక్కాణించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కావాలి.. ప్రభుత్వంలో ఉన్న వారిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయాలి.. ప్రజలను రెచ్చగొట్టాలి. హింసను సైతం ప్రేరేపించాలి.. అభాండాలు వేయాలి.. కార్యకర్తలను కేసులు పెట్టించుకోవాలని కూడా అంటారు. అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం వద్దు.. నియంతృత్వం కావాలి. తనను వ్యతిరేకించే పార్టీలను, మీడియాను అణచివేయాలి. ఏం చేసినా, చేయకపోయినా అంతా అభివృద్ది చేసేసినట్లు బాజా వాయించుకోవాలి. గతంలో ‘జయము, జయము చంద్రన్న’ అంటూ, లేక ఇప్పుడు ‘చంద్రబాబూ నువ్వే కావాలి’ అంటూ సినీ ఫక్కీలో పాటలు పాడించుకోవాలి. ఒక పార్టీనే అధికారంలో ఉండాలంటే ఆ స్థాయిలో పని కూడా చేయాలి కదా?.
వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేస్తున్నారని గమనించి, అంతకు మూడురెట్లు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల విలువైన సంక్షేమం ఇస్తానని, అసత్య వాగ్ధానాలు చేసి, అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకపోయినా ఇచ్చేసినట్లు దబాయించినా జనం ఓట్లు వేయాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబు మామ ఎన్టీఆర్‌ను తోసేసి గద్దెనెక్కిన తరువాత ఎన్ని సార్లు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారో అందరికీ తెలుసు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు పాలనే సక్రమంగా ఉండి ఉంటే ఇన్ని రకాల పొత్తులు అవసరమై ఉండేవా? అన్నది ఆయన ఆలోచించుకోవాలి.
అభివృద్ది అన్నది నిరంతర ప్రక్రియ. కానీ, తాను లేకపోతే అభివృద్ది ఉండదని ప్రజలకు చెప్పడం అంటే అతిశయోక్తులు చెప్పడమే. హైదరాబాద్ తానే అభివృద్ది చేశానని ఈ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయిన 21 ఏళ్ల తర్వాత కూడా చెబుతున్నారంటే ఏమనాలి!. హైటెక్ సిటీ భవనం ఒక్క దానిని కట్టి ఆ ప్రాంతం అంతా తానే కట్టేశానని చెప్పగలిగిన సమర్థత ఆయనది. నిజానికి హైదరాబాద్ పడమటి ప్రాంతంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రభుత్వమే. అంతకుముందు ఎన్టీ రామారావు హయాంలో మెహిదీపట్నం మీదుగా బీహెచ్ఈఎల్ వరకు హైదరాబాద్ రింగ్ రోడ్డు వేశారు. ఆ రోడ్డు పక్కన పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయి. అయినా అంతా తన ఘనతని ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైనవి వచ్చాయి. కేసీఆర్ పాలన సమయంలో పలు వంతెనలు, కొత్త ఐటి కంపెనీలు వచ్చాయి.
ఏపీలో టీడీపీ పాలనకు, వైఎస్సార్‌సీపీ పాలనకు ఉన్న తేడాను కేస్ స్టడీ చేయాలని చంద్రబాబు అనడం బాగానే ఉంది. ఎన్నికల మేనిఫెస్టోతో పోల్చుతారా? లేక చంద్రబాబు, జగన్ టైమ్‌లలో తెచ్చిన అప్పులతో పోల్చుతారా?. జగన్ తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటిని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పోల్చుతారా?. జగన్ తెచ్చిన ఓడరేవులు, గ్రామ, గ్రామానా జగన్ నిర్మించిన భవనాలు, చంద్రబాబు టైమ్‌తో పోల్చుతారా?. విద్య, వైద్య రంగాలు ఎవరి కాలంలో ఎలా ఉన్నాయో పోల్చుతారా?. ప్రజల ఇళ్ల వద్దకు సేవలు అందించడంలో కూడా పోల్చవచ్చు!. సెకీతో చౌకగా రూ.2.49లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న జగన్ పాలనను, అధిక ధరకు రూ.4.60లకు కొనుగోలు చేసిన చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చుతారా?. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల వ్యయాన్ని కూడా కేస్ స్టడీగా తీసుకుంటే బాగానే ఉంటుంది.
నీటిపారుదల రంగంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ హయంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా కేస్ స్టడీ చేయవచ్చు. ఇక్కడ ఒక్క సంగతి చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఇప్పటికి సుమారు 15 ఏళ్లు పాలన పూర్తి చేశారు. కానీ, వైఎస్సార్ ఐదేళ్లు, జగన్ మరో ఐదేళ్లు పాలన చేశారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కేస్ స్టడీ చేస్తే నిజంగానే మంచి పరిశోధనే అవుతుంది. చంద్రబాబు వాదనలలోని డొల్లతనం, ఎన్ని రకాలుగా ఆయన మాటలు మార్చింది. ఆయన టైమ్‌లో జరిగిన అవినీతి, స్కామ్‌లు అన్ని విషయాలు బయటకు వస్తే ఆయనకే అప్రతిష్ట అవుతుంది.
జనం ఎవరూ అడగరు కనుక మహానాడులో ఏవో ఉపన్యాసాలు చెప్పి, అవే నిజాలని ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాధ్యం కాకపోవచ్చు. చివరిగా ఒక మాట. ఈ మహానాడు జరిగిన తీరు ఎలా ఉన్నా ఎల్లో మీడియా మహానాడులో నాలుగు లక్షల మందికి మహా భోజనం అని ప్రచారం చేసింది. అది కూడా సరిగా జరగలేదని, చాలామంది భోజనం దొరక్క ఇబ్బంది పడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇలా కవరింగ్ ఇచ్చుకున్నారన్న మాట.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.