
సాక్షి, అమరావతి: సుప్రీం కోర్టు తీర్పుతో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. కొమ్మినేనిని తక్షణమే రిలీజ్ చేయాలంటూ.. ఆయన అరెస్ట్ అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. సాక్షి, కొమ్మినేనికి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ఏ సంబంధం లేకపోయినా.. వాటిని ఆపాదిస్తూ ఎల్లో బ్యాచ్ ఎంతగా రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరిగిందో పరిశీలిస్తే..
9వ తేదీ సోమవారం..
గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని ఈ నెల 9వ తేదీన(సోమవారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఆ రోజు ఉదయమే చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఏ అభియోగాలపై తనను అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించిన కొమ్మినేనికి సరైన సమాధానం ఇవ్వలేదు.
👉70 ఏళ్ల వయసులో.. సీనియర్ సిటిజన్, పైగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను.. ఇంటి లోపల గదిలోకి వెళ్లి మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు తరలించారు. కొమ్మినేనిని సోమవారం ఉదయం 11 గంటలకు అరెస్టు చేసినట్టు ప్రకటించారు.కొమ్మినేనిపై బీఎన్‌ఎస్ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్‌సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసిందని వైఎస్సార్‌సీపీ మండిపడింది. అదే సమయంలో సాక్షి మీడియా సంస్థలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి.
పోలీసులపై మంగళగిరి కోర్టు ఆగ్రహం
ఈ నెల 10న (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారు? అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్‌ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిబేట్‌లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ సెక్షన్లు కొట్టి వేస్తున్నట్లు చెబుతూ.. మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.
ఇవాళ.. పోలీసులకు సుప్రీం కోర్టు మందలింపు
కొమ్మినేని అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం(13 జూన్) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు?. నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?.. అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేమూ నవ్వుతాం అని వ్యాఖ్యానించింది . వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం.