కార్పొరేషన్ నజరానా
కోడెల అల్లుడికి చెందిన హాస్పిటల్‌కు పన్ను తగ్గింపు
నిబంధనలు తుంగలో తొక్కి పన్ను రివిజన్
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అర్జీ
ఆగమేఘాలపై అధికారుల నిర్ణయం
లాలాపేటలో కమర్షియల్ కాంప్లెక్స్‌కు కూడా పన్ను తగ్గింపు
అధికారంలో ఉన్నారని తెలుగుదేశం నేతలకు, వారి సంబంఽధీకులకు లబ్ధి చేకూర్చేందుకు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు కోడెల అల్లుడికి ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకు పావులు కదిలాయి. ఎప్పుడో పదేళ్ల క్రితం కట్టిన ఆసుపత్రి భవనాల కొలతలు ఇప్పుడు మారాయి. ఆస్తిపన్ను రూ.లక్షల్లో తగ్గిపోయింది. ఇటు టీడీపీ వారు, అటు అధికారులు ప్రజాధనం పట్టపగలే దోచుకునేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు.
కోడెల అల్లుడికి
సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అల్లుడికి కార్పొరేషన్ నజరానా అందించింది. శివప్రసాద్ అల్లుడికి చెందిన హాస్పిటల్‌కు సంబధించిన ఆస్తి పన్నును ఆరు నెలలకు సుమారు రూ. 2,69,519 లక్షల వరకు తగ్గించి తమ స్వామి భక్తిని అధికారులు చాటుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆస్తి పన్నులు పెంచే కార్యక్రమాలను చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ రివిజన్ పిటిషన్ పేరుతో పన్నును ఏకంగా రూ.లక్షల్లో కార్పొరేషన్ అధికారులు తగ్గించడం గమనార్హం.
రూ. రెండున్నర లక్షలకుపైనే..
గుంటూరు నగరంలో కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ వద్ద కోడెల శివప్రసాద్ అల్లుడికి చెందిన ఓ హాస్పిటల్ ఉంది. సిల్ట్, సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మరో నాలుగు ఫ్లోర్లు ఉన్న ఈ భవనానికి ఆరు నెలల కాలానికి సుమారు రూ.4.50 లక్షల వరకు ఆస్తిపన్ను ఉంది. కొద్ది సంవత్సరాలుగా పన్ను కడుతూ వచ్చారు. ఇప్పుడు సెల్లార్, సిల్ట్ కొలతలు తప్పు ఉన్నాయని, నాలుగో అంతస్తులో తాము నివాసం ఉంటున్నామని పిటిషన్ పెట్టుకున్నారు. ఇది సాధ్యం కాదని అధికారులు తిరస్కరించారు. మళ్లీ దరఖాస్తు చేసుకోగా చట్టం అనుమతించకపోయినా మళ్లీ కొలతలు వేసి పన్ను తగ్గించేయడం వివాదాస్పదంగా మారింది. వేసినవి కూడా కాకి లెక్కలుగా ఉన్నాయి. సెల్లారు, సిల్ట్‌కు చదరపు అడుగు విలువ కేవలం రూ.900గా చూపించగా, పై అంతస్తులకు సుమారు రూ.1,400 మాత్రమే చూపించి ఆస్తి విలువ గణనీయంగా తగ్గించేశారు. దీని ఆధారంగా పన్ను తగ్గించేశారు. గతంలో రూ.4,58,772 ఉన్న ఆస్తి పన్ను ఇప్పుడు ఏకంగా రూ.1,89,253 కు తగ్గించేశారు. ఈ సంవత్సరంలో పన్ను తగ్గించమని కోరిన వెంటనే ఎటువంటి పిటిషన్ లేకుండానే కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది వెళ్లి కొలతలు పరిశీలించి పన్నును తగ్గించడం గమనార్హం.
పదేళ్ల తర్వాత మారిన కొలతలు
సాధారాణంగా ఒక ఆస్తి పన్నును తగ్గించాలంటే రెవెన్యూ సిబ్బంది ఎన్నో కోర్రీలు పెట్టి దానిని తగ్గించకపోగా.. పన్నును పెంచే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ మాజీ స్పీకర్, టీడీపీ నాయకులు కోడెల శివప్రసాద్‌కు చెందిన అల్లుడి హాస్పిటల్ కావడంతో ఆగమేఘాలపై పన్నును తగ్గించేశారు. దశాబ్దానికిపైగా పన్ను చెల్లిస్తుండగా, ఇప్పుడు రివిజన్ పిటిషన్ పేరుతో ఎలా తగ్గించారన్నది ఇక్కడ ప్రశ్న. అప్పట్లో భవనానికి ఇప్పుడు కొలతలు ఎలా తగ్గిపోయాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మున్సిపల్ అదనపు కమిషనర్ చల్లా ఓబులేశును ‘సాక్షి’ వివరణ అడగగా, సదరు ఆసుపత్రి యాజమాన్యం రివ్యూ పిటిషన్ ప్రకారం కొలతలు వేయగా, మార్కెట్ విలువలను బట్టి పన్నులను సరిచేశామని వివరణ ఇచ్చారు.
లాలాపేట మెయిన్‌రోడ్డులో ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌కు రూ. రెండు లక్షల వరకు పన్ను ఉంది. దానిని కూడా రూ.90 వేల వరకు తగ్గించేశారు. రివిజన్ పిటిషన్ పేరుతో నగరంలో పదుల సంఖ్యలో పన్నులు తగ్గించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర అభివృద్దికి ఆస్తి పన్నులే కీలకం. వాటి ద్వారానే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇలా తమకు అనుకూలమైన వారికి రూ.లక్షల్లో పన్నులు తగ్గించుకుంటూ పోతే కార్పొరేషన్‌కు ఆదాయం ఎలా పెరుగుతుందని కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలోని ఒక ప్రముఖ హోటల్‌కు కూడా ఎటువంటి మ్యుటేషన్ చార్జీలు వసూలు చేయకుండానే కంపెనీ పేరు మార్పునకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.


