అపూర్వ సాయం | - | Sakshi
Sakshi News home page

అపూర్వ సాయం

Nov 28 2025 8:39 AM | Updated on Nov 28 2025 8:39 AM

అపూర్

అపూర్వ సాయం

గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి విరివిగా విరాళాలు

ఏడాదిలో రూ. 7.50 కోట్లతో

పలు పనులు

చొరవ తీసుకున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుందరాచారి

కళాశాల రూపురేఖలు మార్చిన పూర్వ విద్యార్థులు

దాతల సహాయం మరువలేనిది

గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తమవంతు సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ వైద్య విభాగాన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్ది, ఇప్పుడు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా వచ్చిన డాక్టర్‌ సుందరాచారి కళాశాల అభివృద్ధిపై దృష్టి సారించారు. కళాశాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.7.50 కోట్లతో అభివృద్ధి పనులు చేయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీఎంఈ, ఇతర ఉన్నతాధికారులు సైతం మెచ్చుకునేలా తీర్చిదిద్దారు.

నాడు గుంటూరు జీజీహెచ్‌లో...

సుందరాచారి గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ వైద్య విభాగంలో ఒకేసారి నాలుగు పీజీ సీట్లు వచ్చేలా చేశారు. పలుమార్లు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో, డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిట పీజీ పరీక్ష ఫలితాల్లో ఆయన మార్గదర్శకంలో పీజీ వైద్యులు సత్తా చాటారు. ఉమ్మడి ఏపీలో ఎక్కడా లేనివిధంగా గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ వార్డులో బ్రెయిన్‌ స్ట్రోక్‌ బాధితుల కోసం చిలకలూరిపేటకు చెందిన ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్‌ సంస్థ, గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్‌ కోయ రామకోటేశ్వరరావు, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ అమెరికా సహాయంతో రూ. కోటితో 2015లో స్ట్రోక్‌ యూనిట్‌ ఏర్పాటు చేయించారు. స్లీప్‌ల్యాబ్‌ను సైతం నాట్కో ఫార్మా సహాయంతో 2017లో అందుబాటులో తెచ్చారు. 2018 జూన్‌లో న్యూరాలజీ వైద్య విభాగానికి ఐఎస్‌ఓ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ఉత్తమ బోధనకు 2023లో స్టేట్‌ బెస్ట్‌ టీచర్‌ అవార్డు అందుకున్నారు. 2022లో ఫెలో ఆఫ్‌ ది అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీగా ఎంపికయ్యారు.

కళాశాల అభివృద్ధిపై దృష్టి

ప్రిన్సిపాల్‌ చొరవతో గుంటూరు వైద్య కళాశాల 1999 బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, ఆయన మిత్రులు రూ. 80 లక్షల విరాళంతో రెండు బస్సులు అందించారు. హాస్టళ్లలో క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడా మైదానాలు, సామగ్రిని మరికొందరు దాతలు ఇచ్చారు. అంతర్గత రోడ్లను 1998 బ్యాచ్‌ పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్‌ నలమోతు శరత్‌చంద్రకుమార్‌ తన తల్లి శైలజకుమారి జ్ఞాపకార్థం ఇచ్చిన రూ. 6 లక్షల విరాళంతో నిర్మించారు. కళాశాల ప్రధాన ద్వారాన్ని పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్‌ చెరుకూరి పవన్‌కుమార్‌ ఇచ్చిన రూ. 7 లక్షలతో నిర్మించారు. ప్రముఖ స్పెయిన్‌ సర్జన్‌, గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్‌ జె.నరేష్‌బాబు కుటుంబం రూ. 25 లక్షలు, ప్రముఖ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ రామకృష్ణారెడ్డి రూ. 10 లక్షలు, డాక్టర్‌ శారద రూ. 6 లక్షల విరాళం ఇవ్వడంతో కళాశాలలో క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. 1980 బ్యాచ్‌కు చెందిన పూర్వ వైద్య విద్యార్థులు రూ. 60 లక్షలు విరాళం ఇవ్వడంతో పలు లెక్చర్‌ గ్యాలరీలను ఆధునికీకరించారు. దాతల సహాయంతో రూ. 10 లక్షలతో ఎగ్జామినేషన్‌ హాలు ఏర్పాటు చేశారు. వాటర్‌ కూలర్లు, పలు విభాగాల ఆధునికీకరణ పనులకు పలువురు దాతల సహకరించారు. కళాశాలలో విద్యుత్‌ వ్యవస్థ మెరుగు, గ్రీన్‌ మ్యాట్‌ ఏర్పాటు, చెట్ల సంరక్షణ, గెస్ట్‌ ఫ్యాకల్టీ భవనం ఆధునికీకరణ, లైబ్రరీ ఆధునికీకరణ, విగ్రహాలతోపాటు ఫౌంటేన్‌ల అభివృద్ధి, వైద్య విద్యార్థులకు, బోధనా సిబ్బందికి ప్రత్యేక వెల్‌నెస్‌ క్లినిక్‌ను ఏర్పాటు వంటివి చేయించారు.

కళాశాల అభివృద్ధికి దాతల సాయం మరువలేనిది. సంస్థను దేశంలో టాప్‌ పది కళాశాలల్లో నిలబెట్టడమే ధ్యేయంగా కృషి చేస్తున్నా. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పూర్వ వైద్య విద్యార్థులు, నగరానికి చెందిన పురప్రముఖులు ప్రోత్సహిస్తున్నారు. బోధనలోనూ, వసతుల్లోనూ కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతా. మాతృ సంస్థకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉంది.

– డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి, ప్రిన్సిపాల్‌

అపూర్వ సాయం 1
1/3

అపూర్వ సాయం

అపూర్వ సాయం 2
2/3

అపూర్వ సాయం

అపూర్వ సాయం 3
3/3

అపూర్వ సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement