ఎండుతున్న పంటలు
నరసరావుపేట రూరల్: కాలువ మరమ్మతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కుప్పగంజి వాగు మళ్లింపు పథకంలోని వందల ఎకరాల చివరి భూములకు నీరు అందక పంటల ఎండిపోయే దశలో ఉన్నాయి. ఎండుతున్న పంటలను రక్షించుకునేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పంట కాలువ మరమ్మతు పనులు చేపట్టారు. కుప్పగంజి వాగు నీటి మళ్లింపు కాలువ పరిధిలో మండలంలోని కేఎం అగ్రహారం, గుంటగార్లపాడు, రంగారెడ్డిపాలెం, ములకలూరు, జొన్నలగడ్డ తదితర గ్రామాల్లో సుమారు 700 ఎకరాలు సాగులో ఉంది.
ఏళ్లతరబడి మరమ్మతులు లేవు...
కేఎం అగ్రహారం నుంచి ప్రారంభమయ్యే కాలువ గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోలేదు. కాలువ పూడికతో నిండిపోవడంతో చివరి భూములకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మిరప, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మిరప రైతులు ఎకరాకు రూ.50 వేలు, మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.40వేలు పెట్టుబడి పెట్టారు. పంటలు ఎండిపోతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంతో రైతులు కాలువ మరమ్మతు చేపట్టారు. జేసీబీతో పూడికతీత ప్రారంభించారు. కౌలు రైతు సంఘం జిల్లానాయకులు కామినేని రామారావు, పీడీఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షుడు కొరిటాల గోపాలరావు, కృష్ణారెడ్డి తదితరులు పంటలను పరిశీలించారు.


