 
													గుడివాడరూరల్: ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు ప్రస్తావించకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము టీడీపీ, జనసేన పార్టీలకు ఉందా అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చిరంజీవి సినీ పరిశ్రమలో కష్టపడి మెట్టుమెట్టు ఎక్కి పేరు సంపాదించుకున్నారని చెప్పారు. ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలిసిన వ్యక్తులని అన్నారు. సినీ పరిశ్రమకు పెద్దగా చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సతీ సమేతంగా కలసి సమస్యలను పరిష్కరించాలని కోరారని చెప్పారు.
చిరంజీవిపై ఉన్న నమ్మకంతో ముఖ్యమంత్రి సినీ పరిశ్రమ సమస్యల పరిష్కార చర్యలు, సినిమా టికెట్ల ధరలను నిర్ణయించాలని ఆయన్నే కోరారన్నారు. అయితే, ఆయన ఒక్కరి అభిప్రాయంతో కాదని, సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలను సీఎం దగ్గరకు తీసుకొచ్చి కలసి సమస్యలను పరిష్కరించాలని చిరంజీవి కోరారని వివరించారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి పవన్ కళ్యాణ్ సొంత అన్నపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కాపులను బీసీల్లో కలుపుతానని మాట ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మాట తప్పారన్నారు. ఊ 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి జనసేన, టీడీపీ పీడ విరగడవుతుందని కొడాలి నాని చెప్పారు.  

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
