
సాక్షి,న్యూఢిల్లీ: ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజా సింగ్‌కు లేఖ రూపంలో తెలియజేశారు.
మీ రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు పార్టీ పని విధానం , సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. మీరు లేవనెత్తి అంశాలు అసందర్భం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో మీ రాజీనామాను ఆమోదిస్తున్నాం అని అరుణ్ లేఖలో తెలియజేశారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్‌నాథ్ యాత్రలో ఉన్నట్లు సమాచారం.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచందర్‌రావు ఎన్నికను వ్యతిరేకిస్తూ గోషామహల్(హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి జూన్ 30వ తేదీన రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాపై వివరణ ఇవ్వమని హైకమాండ్ కోరితే అందుకు తాను సిద్ధమని చెప్పారాయన. కానీ, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే ఇప్పుడు రాజీనామాకు అధిష్టానం ఆమోదం తెలపడం గమనార్హం.
