
మొత్తం సీట్లలో 72 నుంచి 75 సీట్లతో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీ పవర్‌లో..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నదానిపై వరుసగా సర్వేలు వెల్లడవుతున్నాయి. తాజాగా జనతాకామూడ్ అనే సంస్థ తన సర్వే రిపోర్ట్ ను ఢిల్లీలో బుధవారం విడుదల చేసింది. మొత్తం సీట్లలో 72 నుంచి 75 సీట్లతో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీ పవర్‌లోకి రానుందని తెలిపింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 31 నుంచి 36 సీట్లకే పరిమితమై రెండో స్థానంలో నిలవనుందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 20 వేల శాంపిల్స్, ప్రతినియోజకవర్గంలో 1100 శాంపిల్స్ సేకరించి సర్వే చేసినట్టు జనతాకామూడ్ ఓనర్ భాస్కర్ సింగ్ తెలిపారు. కర్నాటకలో పార్టీ ఓటమి, బీజేపీ స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్ తొలగింపు తెలంగాణలో కమలం పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి కారణమయ్యాయని చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 41 శాతం ఓట్ షేర్ రానుందని, కాంగ్రెస్ కు 34 శాతం, బీజపీకి 14 శాతం, ఎంఐఎం 3 శాతం ఓట్ షేర్ తెచ్చుకుంటాయని సర్వేలో తేలింది. సెంటర్ లో పవర్ లో ఉన్న బీజేపీ తెలంగాణలో కేవలం 4 నుంచి 6 సీట్లు గెలవనుందని సర్వే తెలిపింది. సర్వే వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్, బీజేపీల మధ్య అంత భారీగా కాకపోయినా ఓ మోస్తరుగా చీలుతోందని తెలుస్తోంది. దీని వల్లే బీఆర్ఎస్ కు మళ్లీ పవర్‌లోకి రావడానికి కావల్సిన సీట్లు రాబోతున్నాయని వెల్లడవుతోంది.
ఇక ఇటీవల తెలంగాణ ఎన్నికలపై విడుదలవుతున్న సర్వేలు ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. పొలిటికల పార్టీలైతే తమకు అనుకూలంగా లేని సర్వేలను ఫేక్ సర్వేలని కొట్టి పడేస్తున్న విషయం తెలిసిందే. ఏ పార్టీకి సర్వే అనుకూలంగా ఉంటే ఆ పార్టీయే సర్వే చేయించిందని నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్ల మైండ్ ను ప్రభావితం చేసేందుకు కొన్ని పార్టీలు సర్వేలు చేయించి సోషల్ మీడియాలోకి వదులుతున్నాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇటీవల ఇండియా టుడే సర్వేలో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. టైమ్స్ నౌ సర్వేతో పాటు కొన్ని ఇతర సర్వేలు, తాజాగా జనతాకా మూడ్ సర్వేలో బీఆర్‌ఎస్ దే మళ్లీ పవర్ అని వచ్చింది. ఇలా ఒక్కో సర్వే ఒక్కో విధంగా చెబుతున్నప్పటికీ అసలు విజేత ఎవరో తెలియాలంటే డిసెంబర్ 3 దాకా వేచి చూడాల్సిందే.