సిరా చుక్క..దానికో లెక్క 

Ink marking method started in 1962 - Sakshi

ఓటేస్తే సిరా గుర్తు కనిపించాల్సిందే 

ఇలా సిరా గుర్తు పెట్టే పద్ధతి1962లో మొదలు 

ఈ సిరా తయారు చేసే  కంపెనీలు రెండే 

కర్ణాటకలోని ఎంపీవీఎల్, హైదరాబాద్‌లోని రాయుడు లేబొరేటరీస్‌

ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు కనిపించడం మామూలే. ఈ సిరా వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది. ఓటు వేసిన వ్యక్తి మళ్లీ ఓటు వేయకుండా ఇలా సిరా గుర్తు పెట్టే పద్ధతి 1962 సార్వత్రిక ఎన్నికల్లో మొదలైంది. దొంగఓట్లు వేయకుండా కట్టడి చేసేందుకు సిరా గుర్తు పద్ధతి సత్ఫలితాలనిస్తోందనే చెప్పాలి. 

సాక్షి, హైదరాబాద్‌:  సిరా చుక్క.. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా అదే. ఎన్నికల్లో ఉపయోగించే సిరాను చెరగని సిరా (ఇండెలబుల్‌ ఇంక్‌) అంటారు. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవారు, 2004 తర్వాత ఇంక్‌ మార్కర్‌లను తీసుకొచ్చారు. మనదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి.  

భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్‌ అధికారిపై ఉంటుంది. ఒక వేళ ఓటరుకు ఎడమచేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి. 

ఎన్నికలు.. పోలియో డ్రాప్స్‌.. 
ఎన్నికల వేళ కీలకంగా మారిన  సిరాను భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌  (ఎంపీవీఎల్‌) ఒకటైతే, హైదరాబాద్‌లోని రాయుడు లే»ొరేటరీస్‌ మరొకటి.

భారత ఎన్నికల సంఘం మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ సిరాను ఎక్కువగా వినియోగిస్తుండగా, ప్రపంచంలోని దాదాపు వందదేశాలకు దేశాలకు రాయుడు లేబొరేటరీస్‌ తయారు చేస్తోన్న సిరా సరఫరా అవుతోంది. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్‌ నైట్రేట్‌ ఉండటం వల్ల ఇంకు గుర్తు 3–4 రోజుల వరకు చెరిగిపోదు. ఈ ఇంక్‌ను స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు   పిల్లలకు పోలియో చుక్కలు వేసే సమయంలోనూ గుర్తుపెట్టేందుకు ఉపయోగిస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top