Huzurabad Bypoll: షెడ్యూల్‌ ఇప్పట్లో లేనట్లే?   

Huzurabad Bypoll CEC sought the parties opinion on the Election Guidelines - Sakshi

 ఎన్నికల మార్గదర్శకాలపై పార్టీల అభిప్రాయం కోరిన సీఈసీ 

 ఈ నెల 30 వరకు గడువు 

ఆ తర్వాతే ఎన్నికలపై స్పష్టత!

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ రేపో మాపో వెలువడుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. కానీ జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఉద్దేశించి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన లేఖ మాత్రం.. ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశముందనే సంకేతాలు ఇస్తోంది. సీఈసీ ఈ నెల 9న లేఖ విడుదల చేసింది.

‘ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరపాల్సి ఉంది. కోవిడ్‌ పరిస్థితుల్లో గతంలో సాధారణ లేదా ఉప ఎన్నికలు జరిగే చోట అనుసరించాల్సిన మార్గదర్శకాలతో అనేక ఆదేశాలు, సూచనలు జారీ చేశాం. అయితే ఇప్పుడు నిర్వహించాల్సిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతంలో జారీ చేసిన ఆయా మార్గదర్శకాలపై మీ పార్టీల అభిప్రాయాన్ని ఈ నెల 30వ తేదీలోగా వెల్లడించగలరు..’అని అందులో కోరింది. 

అభిప్రాయాలు పరిశీలించిన తర్వాతే.. 
గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, మేఘాలయ, ఏపీ, తమిళనాడులో పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలోనూ ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే సీఈసీ ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను కోరడం, ఈ నెల 30లోగా సలహాలు, సూచనలు అందజేయాలని కోరిన నేపథ్యంలో ఇప్పట్లో ఉప ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించడానికి సమయం పడుతుందని, ఆ తర్వాతే ఉప ఎన్నికలపై సీఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. దీంతో పాటే శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో కోవిడ్‌ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top