
సాక్షి, హైదరాబాద్: మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్ స్పందిస్తున్న తీరుకు.. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటూ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీమ్‌లా మాట్లాడుతున్నట్లు ఉందని విమర్శించారు. సీఎం ఎక్కడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. రేవంత్ మాటలు చూస్తుంటే ఖర్గే, రాహుల్ నాయకత్వంలో పనిచేయడం లేదనే విషయం అర్ధం అవుతుందన్నారు.
మోదీకి అనుకూలంగా రేవంత్
కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీకి, ప్రధాని మోదీకి అనుకూలంగా రేవంత్ పనిచేస్తున్నారని మరోసారి తేటతెల్లమయిందన్నారు హరీష్ రావు. మద్యం పాలసీ కేసు విషయంలో ఇన్నాళ్లుగా తాము ఏమి చెప్తున్నామో ఇప్పుడు ఖర్గే, రాహుల్ గాంధీ అదే చెప్పారన్నారు. మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకుందని దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయ వేధింపుల కోసం వాడుకుంటున్నదని తాము ముందే ఆరోపించామని పేర్కొన్నారు. ఇప్పుడు తమ వాదనను ఏఐసీసీ కూడా బలపరిచిందని తెలిపారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రేవంత్ వ్యాఖ్యలు
లిక్కర్ స్కామ్ అనేది ఒక కుట్ర అని.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతుందని ఏఐసీసీ నేతలు విమర్శించారని చెప్పారు. కానీ.. రేవంత్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏఐసీసీ నాయకులు మాట్లాడిన దానికి విరుద్ధంగా పూర్తి మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందని.. అందులో నిందితులను అరెస్టు చేయడం ఆలస్యమైందంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
బీజేపీ తరపున వకాల్తా?
రేవంత్ కాంగ్రెస్ మనిషి కాదు, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం నిండి ఉన్న మోదీ మనిషి అని మేము ముందు నుంచీ చెప్తున్నాం. అది ఇప్పుడు అదే నిజమని తేలింది. తాను కాంగ్రెస్‌లో ఉన్న విషయం కూడా మరిచిపోయినట్టు ఉన్నారు. కేవలం బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’ అని హరీష్ రావు మండిపడ్డారు.