సాక్షి, విశాఖపట్నం: దేశంలో ఎన్నడు లేని విధంగా విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించలేక మంత్రి రామ్మోహన్ నాయుడు చేతులు ఎత్తేశారంటూ మండిపడ్డారు.
‘‘మన తెలుగు వాడికి విమానయాన శాఖ మంత్రి పదవి వచ్చిందని సంతోషించాము. దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువును మంత్రి తీశారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మంత్రి క్షమాపణ చెప్పాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. ఇది మా డిమాండ్ కాదు.. దేశ ప్రజలు కూడా అదే కోరుతున్నారు. విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు సమర్థుడు కాదని దేశ ప్రజలు అంటున్నారు.
..ఇండిగో సమస్యను లోకేష్ వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇండిగో సమస్యను పరిష్కరించడానికి లోకేష్ ఎవరు.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న మంత్రుల్లో లోకేష్ ఒకరు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి టీడీపీ నేతలకు సిగ్గు లేదా.. తండ్రి ఆఖరి చూపులకు వెళ్లలేని పరిస్థితి బిడ్డలకు ఏర్పడింది. నూతన వధూవరులను బంధువులు కలవలేని పరిస్థితి నెలకొంది. ఇండిగో సమస్యను అడ్డం పెట్టుకొని మిగతా సంస్థలు విపరీతంగా రేట్లు పెంచాయి.

..విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 30,000 పెట్టీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు వచ్చి నెత్తి మీద హెల్మెంట్ పెట్టుకొని రీల్స్ తీయడం తప్పితే రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఏం చేశారు.. భోగాపురం ఎయిర్ పోర్టు పనులు వేగంగా జరగడానికి కారణం వైఎస్ జగన్. ఎల్లో మీడియాలో లోకేష్‌ను జాకీలు ఎత్తినట్లు నేషనల్ మీడియాలో ఎత్తలని టీడీపీ నేతలు చూశారు. టీవీ-5 సాంబశివరావు దగ్గర జాకీలు ఎత్తినట్లు ఎత్తితే నేషనల్ మీడియా ఊరుకుంటుందా?. మంత్రి రామ్మోహన్ రీల్స్ మానివేసి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి.. టీడీపీ పబ్లిసిటీ పిచ్చి వలన దేశంలో తెలుగు వారి పరువు పోయింది’’ అని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.


