చంద్రబాబుకు మోసం వెన్నతో పెట్టిన విద్య: కోన రఘుపతి | Ex Deputy Speaker Kona Raghupathi Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మోసం వెన్నతో పెట్టిన విద్య: కోన రఘుపతి

Sep 14 2025 3:27 PM | Updated on Sep 14 2025 3:55 PM

Ex Deputy Speaker Kona Raghupathi Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ పనులను ప్రారంభిస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబుకి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నాడని మండిపడ్డారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు, మంత్రులు చెబుతున్న అబద్దాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి, ప్రజలు, మేధావులు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం సామాజిక బాధ్యతగా పేదవాడికి అందించాల్సిన విద్య, వైద్యాన్ని ఎప్పటికప్పుడు విజయవంతంగా పక్కదారి పట్టించడం చంద్రబాబుకు అలవాటు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల దగ్గర నుంచి యూజర్ ఛార్జీల పేరిట ముక్కు పిండి వసూలు చేయడమే తప్ప వారికి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ లేదు. పేదవాడు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలని.... మేం మాత్రం పెత్తనం చేయాలన్న ధోరణి చంద్రబాబుకు పుట్టుకతో వచ్చింది. ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా చంద్రబాబుది కుక్కతోక వంకర బుద్ధి. ఎన్నికల ముందు ప్రజల నుంచి ఓట్లు దండుకోవడం కోసం కళ్లార్పకుండా  ప్రజలకు అబద్దపు హామీలివ్వడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.

 వైఎస్‌ జగన్ చారిత్రాత్మక నిర్ణయం
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు అనేది వైయస్.జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. మేధావులు, విజ్ఞులు కూడా దీనిపై ఆలోచన చేయాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే... 2019-24 తర్వాత వైయస్.జగన్ హయాంలో నీతిఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న ప్రతిపాదనను అందిపుచ్చుకుని ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు వైయస్.జగన్ గారు తీసుకున్న నిర్ణయం మాకందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇదే విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే... ఏటా మనం ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.3వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం, దానితో పోల్చుకుంటే వీటి నిర్మాణం కష్టం కాదని చెప్పారు.

మరోవైపు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను మనం చూశాం. రాష్ట్ర విభజన తర్వాత అత్యాధునిక వైద్యం అందించే ఆసుపత్రులు హైదరాబాద్ లో ఉండిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మనం చెన్నై, బెంగుళూరులో కూడా ఆరోగ్యశ్రీ కింది చికిత్స పొందే అవకాశం కల్పించాం. కానీ శాశ్వతంగా మన రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇదే మంచి సమయం అని ఏకంగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయించారు.

అయినా సొంత మీడియాలో తప్పడు రాతలు..
ప్రతి ప్రభుత్వ బోధనాసుపత్రి పరిధిలో 500 పడకల ఆసుపత్రి, మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి అత్యుత్తమ వైద్య విద్యను, వైద్యాన్ని అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇంత గొప్ప పనిని ప్రశంసించకపోగా.. తమ చేతిలో మీడియా ఉందని తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు ప్రచారంతో విద్యావంతులను సైతం తప్పుదారి పట్టిస్తున్నారు.  ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను కొంత రుసుముతో పేమెంట్ కోటా తరహాలో చేసి ఆ వచ్చిన మొత్తాన్ని ఆయా కాలేజీల నిర్వహణ, అభివృద్దికి ఉపయోగించాలని ప్రతిపాదన చేస్తే... ఆ రోజు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, లోకేష్ లు దానిపైన కూడా తీవ్ర విమర్శలు చేశారు.

Kona Raghupathi: పేదలకు అందించాల్సిన విద్య, వైద్యాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టిస్తున్నారు

తాము అధికారంలోకి వస్తే...ఆ విధానాన్ని రద్దు చేస్తాం.. పేదల సీట్లు అమ్ముకుంటారా అంటూ పెద్ద, పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కాలేజీలనే ప్రైవేటుకు ధారాదత్తం చేస్తామనడం ఎంతవరకు సమంజసం. వాస్తవానికి ఇవాల ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న ప్రవైటు ఆసుపత్రులన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నియంత్రణలో పనిచేయాలి. కానీ వాటిని మనం ఏ మేరకు కంట్రోల్ చేయగలుగుతున్నామన్న విషయం అందిరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తామనడం దారుణం.

ఇవిగో మెడికల్ కాలేజీలు.. కళ్లు తెరిచి చూడండి..
వైఎస్‌ జగన్ ప్రభుత్వ నేతృత్వంలో ఏకంగా 17 మెడికల్ కాలేజీల కోసం అనుమతిలు తెచ్చి, స్దల సేకరణ పూర్తి చేయడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టారు. వీటిలో 7 కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయగా.. 5 మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే.. వద్దని ఎంసిఐ కు లేఖ రాశారు. మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్ మెంట్, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కూడా అందని విధంగా వైఎస్‌ జగన్ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించారు.

బాధ్యత గల ప్రభుత్వంగా మిగిలిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయాల్సింది పోయి, వాటిని ప్రైవేటు పరం చేయడానికి... చంద్రబాబు సహా మంత్రులు మాట్లాడుతున్న పచ్చి అబద్దాలు చూస్తుంటే అసహ్యం కలుగుతోంది. కనీస హోంవర్క్ చేయకుండా మాట్లాడుతున్న హోం మంత్రి అనిత అయితే కనీస అవగాహన లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకవైపు మచిలీపట్నం లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం పూర్తయింది. విజయనగరంలో అన్ని రకాల వసతులతో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తైతే... ఇవేవీ మీ కళ్లకు కనిపించడం లేదా?  పైగా ఎల్లో మీడియాలో 10 కొత్త కాలేజీలకు శ్రీకారం అంటూ అబద్దపు వార్తలు వండి వార్చుతున్నారు.

వైఎస్‌ జగన్ హయాంలోనే ప్రభుత్వ రంగంలో మంజూరైన కాలేజీలనే... ప్రైవేటు పరం చేస్తూ... మళ్లీ వాటిని తామేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్టు రాయడం చూస్తుంటే ఇంతకన్నా  సిగ్గుమాలినతనం ఇంకోకటుండదు. కళ్లకు పచ్చపాతం సోకిన వ్యక్తులను ఏవరూ ఏం చేయలేదు. కానీ రాష్ట్రంలో ఉన్న మేధావులు, తటస్థులు వాస్తవాలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. అప్పుడే నిజాలు తెలుస్తాయి. లేదంటే పచ్చ పత్రికలు రుషికొండ టూరిజం భవనాల తరహాలో ఇదే విధంగా దుష్ప్రచారం చేస్తారు.

మీరు చేయని పనికి కూడా క్రెడిట్ తీసుకోవడం మీకెప్పుడూ అలవాటే చంద్రబాబూ. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించి, పూర్తి చేసింది కూడా వైఎస్సారే. శంషాబాద్ ఎయిర్ పోర్టుకి మీ హయాంలో కనీసం భూసేకరణ కూడా చేయలేదు. కానీ మీరే కట్టామని నిస్సిగ్గుగా కేడర్ తో మాట్లాడతారు. మీరేం చెప్పినా వాటిని ప్రచారం చేసే మాధ్యమాలున్నాయన్న ధీమాతో అబద్దాలను నూరుపోస్తున్నారు. పదే, పదే అబద్దాలు ప్రజలకు నూరుపోసి వాటినే నిజాలని భ్రమింపజేయడం మీకు మొదటి నుంచీ అలవాటే.

నంద్యాల మెడికల్ కాలేజీ అద్భుతంగా నిర్మాణం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ది  ఉంటే రండి వెళ్లి చూసి వద్దాం. పేద ప్రజలకు వైద్యం, పేద విద్యార్ధులకు వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ వీటి నిర్మాణం ప్రారంభించారు. వైద్య ఆరోగ్య రంగమే కాదు వ్యవసాయ రంగం కూడా ఈ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం వల్ల రైతులకు మద్ధతు ధర కూడా రావడం లేదు.

ప్రతి వేయి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వైద్య విద్యను అభ్యసించాల్సిన పిల్లలను ప్రోత్సహించాల్సి ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎలా ఇగ్నోర్ చేస్తున్నారు. 15 నెలల్లో రూ.1.90 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ డబ్బులు ఏమయ్యాయి. ఎవరి జేబుల్లోకి పోయాయి. పేదవాడి వైద్యానికి అవసరమయ్యే వైద్య కళాశాలలు కట్టమంటే... డబ్బుల్లేవని బీద పలుగులు పలుకుతున్నావు. పైగా వైయస్.జగన్ హయాంలో రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేస్తే... రూ.10-12 లక్షల కోట్లు అప్పు చేశారని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పారు. తీరాచూస్తే అసెంబ్లీ సాక్షిగా మీ ఆర్ధిక మంత్రే వైఎస్‌ జగన్‌ జగన్ హయాంలో రూ.4.67 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి.. సభ బయటకు రాగానే మరలా ఇంకో రకంగా మాట్లాడ్డం సిగ్గుచేటు. మీ మంత్రి పార్ధసారధి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని చెబితే... చంద్రబాబు  మాత్రం వైయస్.జగన్ హయాంలో ఒక్క కాలేజీ పూర్తి కాలేదు. మేమే తెచ్చాం అని నిస్సిగ్గుగా చెబుతున్నారు.

రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో రూ.1లక్ష కోట్లు అని చెప్పాడు. ఇప్పుడేమో అది ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. భవిష్యత్ అవసరాల పేరుతో రాజధాని నిర్మాణం కోసం లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కేవలం రూ.4 వేల కోట్లు ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు అందించే మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెట్టలేవా చంద్రబాబూ? వైయస్.జగన్ ప్రభుత్వంలో అప్పులు గురించి గగ్గోలు పెడుతూ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మాట్లాడిన మీరు.. ఓట్లు కోసం సూపర్ సిక్స్ పేరుతో విపరీతమైన హామీలిచ్చారు.

తీరా ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మేధావులు, వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాలు నిగ్గు తేల్చాల్చి ఉంది.  నిజాలు మీరే క్షేత్రస్ధాయిలో పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.ఆ తర్వాత మీరే నిజాలు ప్రజలకు తెలియజేయండి.

బాపట్ల ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి...
బాపట్లలో నాడు నేడు కింది అన్ని పీహెచ్ సీలను ఆధునీకరించాం. రూ.3.50 కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం. కొత్తగా వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేశాం.  బాపట్ల ఏరియా ఆసుపత్రిలో గతంలో ఒక ఎమర్జెన్సీ వార్డులో రెండు ఆక్సిజన్ బెడ్స్ ఉండే పరిస్థితి నుంచి కోవిడ్ మహమ్మూరిని సమర్ధవంతంగా ఎదుర్కున్నాం. ఇప్పుడు 120 ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ ప్లాంట్, ఐసీయూ వైయస్.జగన్ ప్రభుత్వంలో నిర్మాణం చేశాం. పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తే... మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 50 సీట్లు కేటాయిస్తే.. మాకు వద్దు అని లేఖ రాసిన  ముఖ్యమంత్రి మీరే చంద్రబాబూ..?

వైద్య విద్య కోసం కజికిస్తాన్, యుక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లి మన పిల్లలు వైద్య విద్య కోసం వెళ్తుంటే.. మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కాలేజీలను మీరు ఎందుకు పూర్తి చేయడం లేదు చంద్రబాబూ ? నిత్యం చంద్రబాబు గ్రాఫిక్స్ చూసి అలవాటు పడిన టీడీపీ కార్యకర్తలు కూడా విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. వైయస్.జగన్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చూపిస్తున్నవి గ్రాఫిక్స్ కాదు... నిర్మాణం పూర్తి చేసుకున్న మెడికల్ కాలేజీలు అన్న విషయాన్ని క్షేత్రస్దాయికి వెళ్లి నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీటితో పాటు రెండో దశలో పిడుగురాళ్లలో 75 శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది.  మార్కాపురంలో లో శరవేగంగా మెడికల్ కాలేజీ పనులు జరుగుతుంటే 15 నెలలుగా వాటి నిర్మాణానికి బ్రేక్ వేశారు.

బాపట్లలో మెడికల్ కాలేజీ గురించి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. చెరువులో కడుతున్నారని చెబుతున్నారు. నువ్వు చెబుతున్న ఐకానిక్ టవర్ నిర్మాణం నీటిలో మునిగిపోతే.. నీటిని తోడడానికే కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు కేటాయించి.. ఆ రైతులను గాలికొదిలి, మరలా మరో 40 వేల ఎకరాలు అవసరం అని చెబుతున్నారు. అంతా మాటల కనికట్టు తప్ప చేతల్లో ఏమీ కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కటే విషయం స్పష్టం చేస్తున్నాం.  ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై వాస్తవాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి మీరే నిజాలు నిగ్గు తేల్చాలని కోన రఘపతి ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆస్తిని ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement